Kavitha Maloth: టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత ఢిల్లీ నివాసంలో ముడుపుల కలకలం.. సీబీఐ అదుపులో ముగ్గురు
- రూ. 5 లక్షలు డిమాండ్ చేసి రూ. లక్ష తీసుకుంటుండగా పట్టివేత
- అరెస్ట్ అయిన వారిలో కవిత కారు డ్రైవర్
- మిగతా ఇద్దరూ ఎవరో తనకు తెలియదన్న ఎంపీ
- ఢిల్లీలో తనకు పీఏలు లేరని స్పష్టీకరణ
మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత ఢిల్లీ నివాసంలో ముగ్గురు వ్యక్తులు ముడుపులు తీసుకుంటూ సీబీఐకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడం కలకలం రేపింది. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్లో పైరవీ కోసం రూ. 5 లక్షల లంచం డిమాండ్ చేసి రూ. లక్ష తీసుకుంటుండగా రాజీవ్ భట్టాచార్య, శుభాంగి గుప్తాతోపాటు ఎంపీ కవిత డ్రైవర్ దుర్గేశ్ కుమార్‌లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అరెస్ట్ అయిన ఇద్దరూ ఎంపీ కవిత పీఏలుగా చెప్పుకుంటున్నారని, ఈ వ్యవహారంలో డ్రైవర్ దుర్గేశ్ పాత్రపైనా ఆరా తీస్తున్నట్టు అధికారులు తెలిపారు.
తన నివాసంలో సీబీఐ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విషయమై ఎంపీ కవిత స్పందించారు. తనకు వ్యక్తిగత కార్యదర్శులు ఎవరూ లేరని స్పష్టం చేశారు. తెలంగాణలో మాత్రమే తనకు ప్రభుత్వం కేటాయించిన పీఏలు ఉన్నారని పేర్కొన్నారు. అలాగే, మహబూబాబాద్‌లోని కార్యాలయంలో ఓ ప్రైవేటు పీఏ ఉన్నారని తెలిపారు. ఢిల్లీలో తనకు రెండు నెలల క్రితమే అధికారిక నివాసాన్ని కేటాయించారని, దుర్గేశ్‌ను కారు డ్రైవర్‌గా నియమించుకున్నానని వివరించారు. సీబీఐకి పట్టుబడిన మిగతా ఇద్దరూ ఎవరో తనకు తెలియదని ఆమె చెప్పారు.