Ground Water: ఏపీలో రికార్డు స్థాయిలో పెరిగిన భూగర్భ జలమట్టం
- గతేడాది సమృద్ధిగా కురిసిన వర్షాలు
- 2020 ఏప్రిల్ 2 నాటికి 13.34 మీటర్ల మేర భూగర్భ జలమట్టం
- ఈ ఏడాది అదే సమయానికి 7.79 మీటర్ల పైకి వచ్చిన జలమట్టం
- లక్షల సంఖ్యలో బోర్లు రీచార్జి
కొన్నాళ్ల పాటు వర్షాభావ పరిస్థితుల కారణంగా ఏపీలో పడిపోయిన భూగర్భ జలాలు మళ్లీ పుంజుకున్నాయి. గతేడాది సమృద్ధిగా వర్షాలు కురియడంతో రాష్ట్రంలో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. 2020 ఏప్రిల్ 2 నాటికి సగటు భూగర్భ జలమట్టం 13.34 మీటర్లు ఉండగా, 2021 ఏప్రిల్ 2న అది 7.79 మీటర్లకు పెరిగింది. ఆ లెక్కన సగటున 5.55 మీటర్ల మేర భూగర్భ జలాలు పైకి ఉబికినట్టు స్పష్టమవుతోంది.
ఈ నీటి సంవత్సరం (గత జూన్ 1 నుంచి ఈ మే 31)లో భూగర్భ జలాలు మొత్తం 688.95 టీఎంసీల మేర పెరిగాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 169.66 టీఎంసీల పెరుగుదల నమోదైంది. అనంతపురం వంటి క్షామపీడిత జిల్లాలోనూ 131.6 టీఎంసీల మేర భూగర్భ జలాలు పెరిగాయి. రాష్ట్ర చరిత్రలో ఇంత అధికస్థాయిలో భూగర్భ జలాలు పెరగడం ఇదే ప్రథమం కాగా, వర్షాభావ పరిస్థితుల్లో ఎండిపోయిన లక్షలాది బోరు బావులు మళ్లీ జలకళ సంతరించుకున్నాయి.