Corona Virus: ఏపీలో కరోనా ప్రమాద ఘంటికలు... ఒక్కరోజులో 9 మంది మృతి
- ఏపీలో తీవ్రరూపం దాల్చుతున్న కొవిడ్
- 7,234కి పెరిగిన కరోనా మరణాల సంఖ్య
- గత 24 గంటల్లో 31,260 కరోనా పరీక్షలు
- 1,398 మందికి పాజిటివ్
- గుంటూరు జిల్లాలో 273 కేసులు
ఏపీలో కరోనా రక్కసి మరింతగా విజృంభిస్తోంది. కొత్త కేసులే కాకుండా కరోనా కారణంగా మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఒక్కరోజులోనే రాష్ట్రంలో 9 మంది ఈ వైరస్ మహమ్మారికి బలయ్యారు. గుంటూరు జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, కడప, కర్నూలు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించినట్టు తాజా బులెటిన్ లో పేర్కొన్నారు. ఈ మరణాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 7,234కి పెరిగింది.
అటు, గత 24 గంటల్లో 31,260 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,398 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 273 కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 198, చిత్తూరు జిల్లాలో 190, కృష్ణా జిల్లాలో 178, నెల్లూరు జిల్లాలో 163 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 787 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ఏపీలో ఇప్పటివరకు 9,05,946 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,89,295 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,417 మంది చికిత్స పొందుతున్నారు.