Tolet: టూలెట్ బోర్డు అంటించినందుకు రూ. 2 వేల జరిమానా!
- ఓ సొసైటీ నుంచి ఈవీడీఎంకు ఫిర్యాదు
- చర్యలు చేపట్టిన జీహెచ్ఎంసీ అధికారులు
- మిగతావారి సంగతేంటని ప్రశ్నిస్తున్న ప్రజలు
ఓ కరెంటు స్తంభానికి టూలెట్ పేపర్ అంటించి, ఎవరికైనా సింగిల్ బెడ్ రూమ్, డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు కావాలంటే, ఈ నంబర్ ను సంప్రదించాలంటూ బోర్డును పెట్టిన వారిపై జీహెచ్ఎంసీ విభాగమైన డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ (ఈవీడీఎం) రూ. 2 వేల జరిమానా విధించింది. ఓ సొసైటీ సభ్యులు ఇటువంటి పోస్టర్ల వల్ల స్తంభాలు, తమ గోడలు అంధ వికారంగా కనిపిస్తున్నాయని ఫిర్యాదు చేయడంతోనే అధికారులు చర్యలకు దిగారు.
అయితే, ఈ నంబర్ గల వ్యక్తి చిరునామా నగరంలో లేదని, సిద్ధిపేట జిల్లా పాములపర్తి గ్రామానికి చెందిన వ్యక్తి ఇదని ఈవీడీఎం అధికారులు గుర్తించారు. అయితే, ఇదే పిల్లర్ పై యాక్ట్ ఫైబర్ నెట్ వారి వ్యాపార ప్రకటన కూడా ముద్రించబడి వుండటం గమనార్హం. వారిపై ఏం చర్యలు తీసుకున్నారని అదే సొసైటీ ప్రశ్నించగా, ఈవీడీఎం అధికారుల నుంచి ఇంకా సమాధానం రాకపోవడం గమనార్హం.