D Mart: రూ.1000 కోట్లతో ఇంటిని కొన్న డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ!
- చదరపు అడుగుకు రూ. 1.61 లక్షల చెల్లింపు
- స్టాంప్ డ్యూటీ కింద రూ. 30 కోట్లు
- మార్చి 31న రిజిస్ట్రేషన్
ఇండియాలోనే అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ ప్రాపర్టీల విక్రయాల్లో ఇది కూడా ఒకటి. డీ మార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ, తనసోదరుడు గోపీ కిషన్ తో కలిసి దక్షిణ ముంబైలోని మలబార్ హిల్ లో రూ.1,001 కోట్లు పెట్టి ఓ ఆస్తిని కొనుగోలు చేశారు. మొత్తం 5,752.22 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్తికి చదరపు అడుగుకు రూ. 1,61,670 చెల్లిస్తూ దమానీ కొనుగోలు చేశారు. ఇటీవలి కాలంలో అత్యంత ఖరీదైన డీల్ ఇదేనని నిర్మాణ రంగ నిపుణులు వ్యాఖ్యానించారు.
మార్చి 31న ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పూర్తయిందని, రెండు అంతస్తుల్లో ఈ భవంతి ఉందని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం, ఈ ప్రాపర్టీ రూ. 723.98 కోట్ల వ్యయమవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇక ఈ డీల్ డాక్యమెంట్ల ప్రకారం, స్టాంప్ డ్యూటీ కింద దమానీ రూ. 30 కోట్లను చెల్లించాల్సి వచ్చింది.
ఇప్పటికే ముంబైలోని అల్టామౌంట్ రోడ్ లో ఓ లగ్జరీ ఇంటిని కలిగివున్న రాధాకిషన్ దమానీ, ఈ కొత్త ఇంటిని సౌరబ్ మెహతా, వర్షా మెహతా, జయేష్ షాల నుంచి కొనుగోలు చేశారు. డీ మార్ట్ రిటైల్ చైన్ ను నిర్వహించే అవెన్యూ సూపర్ మార్ట్స్ ఇటీవల రూ. 113 కోట్లు పెట్టి వాధ్వా గ్రూప్ నిర్మిస్తున్న ప్రాజెక్టులో 39 వేల చదరపు అడుగుల విస్తీర్ణమున్న రెండు ఫ్లోర్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆపై థానేలో 8 ఎకరాల భూమిని కూడా క్యాడ్ బరీ ఇండియా (ఇప్పుడు మాండెలెజ్ ఇండియా) నుంచి రూ. 250 కోట్లతో కొనుగోలు చేసింది.