Chinta Mohan: పవన్ కల్యాణ్ ఎంత ప్రచారం చేసినా ప్రయోజనం ఉండదు: తిరుపతి కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్
- తిరుపతి పార్లమెంటు స్థానానికి ఈ నెల 17న ఎన్నికలు
- కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న చింతా మోహన్
- పవన్ ప్రచారం వృథా ప్రయాసగా మిగిలిపోతుందని వ్యాఖ్యలు
- ధరల పెరుగుదల బీజేపీ పతనానికి దారితీస్తుందని వెల్లడి
తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నిక ఈ నెల 17న జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ ఎంపీ చింతా మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి తరఫున జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఎంత ప్రచారం చేసినా ఉపయోగం ఏమీ ఉండదని అభిప్రాయపడ్డారు. వృథాగా శ్రమించడం తప్ప ఫలితం ఉండదని పేర్కొన్నారు.
గతంలో కాంగ్రెస్ కు ఎలాంటి పరిస్థితి ఎదురైందో ఇప్పుడు బీజేపీ అలాంటి పరిస్థితినే చవిచూడబోతోందని చింతా మోహన్ పేర్కొన్నారు. దేశంలో ధరల పెరుగుదలకు బీజేపీనే కారణమని, అదే బీజేపీని పతనం దిశగా నడిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీలు ప్రజలను ప్రలోభాలకు గురిచేయకుంటే కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవడం ఖాయమని స్పష్టం చేశారు.