Pawan Kalyan: శివమణితో కలిసి డ్రమ్స్ వాయించిన పవన్ కల్యాణ్... బండ్ల గణేశ్ లా మాట్లాడలేనంటూ వ్యాఖ్యలు
- హైదరాబాదులో వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
- హాజరైన పవన్ కల్యాణ్
- మూడేళ్ల తర్వాత సొంత సినిమా ఫంక్షన్ లో పాల్గొంటున్నానని వెల్లడి
- దిల్ రాజు, వేణు శ్రీరామ్ తో పనిచేయడం అదృష్టంగా భావిస్తానని వివరణ
హైదరాబాదు శిల్పకళావేదికలో నిర్వహించిన వకీల్ సాబ్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రముఖ డ్రమ్మర్ శివమణితో కలిసి డ్రమ్స్ వాయించారు. తనతో కలిసి డ్రమ్స్ వాయించాలంటూ శివమణి... పవన్ ను వేదికపైకి ఆహ్వానించారు. శివమణి కోరికను మన్నించిన పవన్ వెంటనే స్టేజిపైకి వెళ్లి కాసేపు శివమణితో డ్రమ్స్ వాయించి వెంటనే డ్రమ్ స్టిక్స్ ను మరొకరికి ఇచ్చేశారు. ఆపై శివమణి వాద్య నైపుణ్యాన్ని ఓ అభిమానిలా ఆస్వాదించారు. అనంతరం తను ప్రసంగించారు.
తాను నటించిన సినిమా ఫంక్షన్ లో పాల్గొని మూడేళ్లయిందని, అయితే బండ్ల గణేశ్ లా తాను మాట్లాడలేనని, రాజకీయ సభల్లో మాట్లాడడం అలవాటైందని అన్నారు. దిల్ రాజు వంటి మంచి నిర్మాత తనతో సినిమా తీయడం అదృష్టంగా భావిస్తానని చెప్పారు. విజయం ఎక్కడ ఉందో పసిగట్ట గల వ్యక్తి దిల్ రాజు అని కొనియాడారు. ఓ డిస్ట్రిబ్యూటర్ గా తన చిత్రాలు ఎన్నో పంపిణీ చేశారని, ఆయనతో ఎప్పుడో సినిమా చేసి ఉండాల్సిందని, తాను ఈ మాటలు ఎంతో నిజాయతీగా చెబుతున్నానని వెల్లడించారు.
వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ గురించి మాట్లాడుతూ, తాను ఓ సాధారణ టైలర్ కుమారుడ్నని చెప్పాడని, అయితే తన తండ్రి ఓ మామూలు కానిస్టేబుల్ అని, ఈ ప్రపంచంలో ఏ వృత్తి ఎక్కువ కాదు, ఏ వృత్తి తక్కువ కాదు అని స్పష్టం చేశారు. ఎంతో సాధారణ స్థాయి నుంచి ఉన్నతస్థాయికి ఎదిగిన వేణు శ్రీరామ్ వంటి దర్శకుడితో పనిచేయడాన్ని తనకు దక్కిన భాగ్యంగా భావిస్తానని వివరించారు.
ఈ సందర్భంగా సీఎం, సీఎం అంటూ అభిమానులు నినాదాలు చేశారు. దాంతో పవన్ స్పందిస్తూ, తాను నటుడ్ని అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదని, కానీ అయ్యానని, ఇప్పుడు సీఎం అవ్వాలన్న విషయం కూడా ఆ విధంగానే స్వీకరిస్తానని స్పష్టం చేశారు. తాను ఇంటర్ రెండుసార్లు తప్పానని, అయితే పుస్తకాలతో జ్ఞానసముపార్జన చేశానని వెల్లడించారు.
వకీల్ అంటే తనకు తెలిసిన మొదటి వకీల్ నానీ పాల్కీవాలా అని వెల్లడించారు. ఆయన తనకు స్ఫూర్తిదాయకం అని, అడ్వొకేట్ వృత్తిపై తనకు గౌరవం కలిగిందంటే నానీ పాల్కీవాలా కారణమని తెలిపారు. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో మానవహక్కుల కోసం బలంగా నిలబడిన వ్యక్తి అని వివరించారు. ఆ తర్వాత చుండూరులో దళితులను ఊచకోత కోస్తే వారికోసం నిలబడిన భువనగిరి చంద్రశేఖర్ కూడా తనకు నచ్చిన న్యాయవాది అని పేర్కొన్నారు.
"ఆయన తన జీవితాన్ని కూడా కోల్పోయారు. క్యాన్సర్ వచ్చి కీమోథెరపీ చేయించుకుంటూ కూడా కోర్టులో దళితుల కోసం వాదించారు. మార్ఫిన్ ఇంజక్షన్లు తీసుకుని మరీ వాదించారని తెలిసింది. కానీ ఆయన అత్తారింటికి దారేది షూటింగ్ సమయంలో చనిపోయారు. ఇప్పుడీ సినిమాలో వకీల్ పాత్ర పోషించడం నా అదృష్టంగా భావిస్తాను" అని వివరించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, వకీల్ సాబ్ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల అద్భుతంగా నటించారని కితాబిచ్చారు. ఇక ప్రకాశ్ రాజ్ వంటి బలమైన నటుడు ఈ చిత్రంలో ఉండడం వల్ల తాను మరింత మెరుగైన నటన కనబర్చగలిగానని పేర్కొన్నారు. అయితే ప్రకాశ్ రాజ్ కు, తనకు మధ్య రాజకీయ విభేదాలు ఉండొచ్చేమో కానీ సినిమాల విషయానికొస్తే తాము ఒక్కటేనని ఉద్ఘాటించారు. తన గురించి ప్రకాశ్ రాజ్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని, వాటిని తాను గౌరవిస్తానని అన్నారు.
చివరగా ఆయన... అభిమానులు లేకపోతే తాను లేనని భావోద్వేగాలతో చెప్పారు. ఫ్యాన్స్ ఆనందం కోసం అనేక విధాలుగా ప్రయత్నిస్తానని వెల్లడించారు. తనకు పొగరు అని చాలామంది అంటుంటారని, తాను ఆ విధంగా నడిస్తే పొగరు అనుకుంటే ఎలా అన్నారు. తన ప్రపంచంలో తాను బతుకుతున్నప్పుడు అది మిగతా వాళ్లకు పొగరులా ఉంటుందని వివరించారు.
ఇక ఈ ఫంక్షన్ లో పవన్ రాజకీయ వ్యాఖ్యలు కూడా చేశారు. తనకు సిమెంట్ వ్యాపారాలు, పేకాట దందాలు లేవని అన్నారు. తాను ఒక సినిమా చేస్తే ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, తనతో పాటు ఎంతోమంది బాగుపడతారని, అందులో ఎలాంటి అవినీతి ఉండదని స్పష్టం చేశారు. భగవంతుడు కరుణించినంత వరకు సినిమాలు చేస్తూనే ఉంటానని, సినిమాల నుంచి పారిపోయే వ్యక్తిని కానని అన్నారు.