Kinjarapu Ram Mohan Naidu: ఓటమి భయంతో ఎన్నికలను బహిష్కరించలేదు: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు
- వైసీపీ నేతలు రాజ్యాంగానికి తూట్లు పొడిచారు
- ఈ అన్యాయాలను ప్రజలకు చెప్పడానికే నిర్ణయం
- మా వాళ్లు పోటీలో ఉన్నారంటే అందులోనూ న్యాయం వుంది
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ తీసుకున్న నిర్ణయంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తోన్న నేపథ్యంలో దీనిపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. ఈ రోజు ఆయన శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ... ఓటమి భయంతోనే తాము ఎన్నికలను బహిష్కరించామని వస్తోన్న ప్రచారం సరికాదని చెప్పారు.
తాము ఎన్నికలను ఎందుకు బహిష్కరిస్తున్నామన్న విషయాన్ని ముందుగానే స్పష్టంగా చెప్పామని ఆయన తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతలు రాజ్యాంగానికి తూట్లు పొడిచారని ఆయన అన్నారు. ఈ అన్యాయాలను భారత ప్రజలకు చెప్పడానికే ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని వివరించారు.
ఇప్పటికే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలమేంటో నిరూపించుకున్నామని ఆయన అన్నారు. అయితే, రాజ్యాంగ బద్ధంగా జరగని ఎన్నికల వల్ల ప్రయోజనం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. స్థానిక పరిస్థితుల వల్ల కొంతమంది టీడీపీ అభ్యర్థులు ఇప్పటికీ పోటీలో ఉన్నారని చెప్పారు. తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పోటీ చేయబోమని చెప్పినప్పటికీ వారు పోటీలో ఉన్నారంటే అందులోనూ న్యాయం ఉందని వ్యాఖ్యానించారు.