TTD: కరోనా వ్యాప్తి నేపథ్యంలో సర్వదర్శనం టోకెన్లు నిలిపివేయాలని టీటీడీ నిర్ణయం
- దేశవ్యాప్తంగా కరోనా విలయం
- దేశం నలుమూలల నుంచి తిరుమలకు భక్తులు
- ఈ నెల 11 వరకే సర్వదర్శనం టోకెన్ల జారీ
- 12వ తేదీ నుంచి టోకెన్ల నిలిపివేత
దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి మరింత పెరిగిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల క్షేత్రానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తున్నందున కరోనా వ్యాప్తి మరింత అధికం కాకుండా ఉండేందుకు ఈ నెల 12 నుంచి సర్వదర్శనం టోకెన్లు నిలిపివేయాలని నిర్ణయించింది. సర్వదర్శనం టోకెన్లను ఈ నెల 11 వరకే జారీ చేయనున్నారు. అయితే మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కొనసాగుతాయని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. సర్వదర్శనం టోకెన్లు మళ్లీ ఎప్పుడు జారీ చేసేది ప్రకటించనున్నారు.
తిరుపతిలో భూదేవి, విష్ణునివాసం కాంప్లెక్స్ లలో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్ల కోసం భక్తులు వేల సంఖ్యలో వేచిచూస్తుంటారు. తద్వారా కరోనా మరింతగా వ్యాపించే అవకాశం ఉందని టీటీడీ ఆందోళన చెందుతోంది. దానికితోడు తిరుపతి నగరంలోనూ కరోనా కేసులు అధికం అవుతున్నాయి.