Nadendla Manohar: అలాగైతే.. కేవలం వైసీపీ గుర్తును మాత్రమే వేసి బ్యాలెట్ పత్రాలు ఇవ్వాల్సింది: నాదెండ్ల మనోహర్
- తమకు ఎదురు నిలబడకూడదనేదే వైసీపీ వాళ్ల ధోరణి
- తప్పుల తడకగా ఎన్నికల ప్రక్రియ
- గున్నేపల్లిలో జనసేన గుర్తు లేకుండా బ్యాలెట్ పత్రాలు
- అధికార పక్షానికే వత్తాసు పలుకుతారా?
వైసీపీపై జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. 'ఎన్నికల్లో బలమైన పోటీగా నిలిచారనే రాజకీయ కక్షతో జనసేన నాయకులు, మహిళ కార్యకర్తలపై దాడులకు, బెదిరింపులకు పాల్పడడం అత్యంత హేయకరమైన చర్య. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక భాగం. తమకు ఎదురు నిలబడకూడదనే వైసీపీ వాళ్ల ధోరణి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని రేగాటిపల్లిలో మా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు చిలకం మధుసూదన్ రెడ్డి ఇంటిపై వైసీపీ వర్గం దాడికి పాల్పడ్డ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం' అని ఓ ప్రకటనలో నాదెండ్ల పేర్కొన్నారు.
దాడులకు పాల్పడుతున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్ తప్పుల తడకగా నిర్వహిస్తోందని ఆయన విమర్శించారు. గున్నేపల్లిలో జనసేన గుర్తు లేకుండా బ్యాలెట్ పత్రాలు ఇచ్చారని ఆరోపించారు. అధికార పక్షానికే వత్తాసు పలకాలని అనుకుంటే కేవలం వైసీపీ గుర్తును మాత్రమే వేసి బ్యాలెట్ పత్రాలు ఇవ్వాల్సిందని వ్యంగ్యంగా అన్నారు.