YSRCP: సీఎం జగన్ పై ఫేక్ వీడియోను పోస్ట్ చేసిన దేవినేని ఉమ.. మాజీ మంత్రిపై చర్యలు
- గత ఏడాది వీడియోకు ఆరేండ్ల నాటి మాటలు పెట్టారన్న ఏపీ సర్కార్
- 2014 ఎన్నికల మేనిఫెస్టో వ్యాఖ్యలను వక్రీకరించారని వెల్లడి
- అసలైన వీడియోలను పోస్ట్ చేసిన సర్కార్
ఏపీ సీఎం జగన్ కు సంబంధించిన మార్ఫ్ డ్ వీడియోను ఆ రాష్ట్ర మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఎవరైనా తిరుపతిలో వచ్చి ఉండండంటే ఎవరూ రారు అని జగన్ అన్నట్టున్న ఆ వీడియో వైరల్ కావడంతో.. ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దేవినేని పోస్ట్ చేసిన తప్పుడు వీడియో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని పేర్కొంది.
2014 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోపై తిరుపతిలో కార్డియాలజీ (హృదయ సంబంధ వ్యాధులు) విభాగం ఏర్పాటుకు సంబంధించి జగన్ మాటలను వక్రీకరించి.. ప్రస్తుత వీడియోకు జత చేశారని పేర్కొంది. దేవినేని షేర్ చేసిన ఫేక్ వీడియోకు సంబంధించి.. అసలైన వీడియోలను పోస్ట్ చేసింది.
దేవినేని పోస్ట్ చేసిన వీడియోను ప్రభుత్వంలోని నిజనిర్ధారణ బృందం ఫేక్ అని తేల్చినట్టు వెల్లడించింది. మార్ఫింగ్ చేసిన వీడియోకు సంబంధించిన అసలైన వీడియో గత ఏడాది మే 26 నాటిదని పేర్కొంది. నాడు ఢిల్లీకి వెళ్లిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారని, ఆ వీడియోను ఎడిట్ చేసి ఆరేళ్ల క్రితం నాటి జగన్ వ్యాఖ్యలను జోడించారని పేర్కొంది.
వీడియోను ఎడిట్ చేసిన వారు చాలా తెలివిగా వ్యవహరించారని, సీఎం పెదాల కదలికలు తెలియకుండా అడ్డుగా వక్రీకరించిన వ్యాఖ్యలు వచ్చేలా చేశారని తెలిపింది. సీఎం జగన్ గత ఏడాది ఢిల్లీ పర్యటన, 2014 ఏప్రిల్ 13 నాటి ఒరిజినల్ వీడియోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దేవినేనిపై చర్యల కోసం ఆ వీడియోలను సంబంధిత అధికారులకు పంపించినట్టు తెలిపింది.
‘‘ఎవరైనా తిరుపతిలో వచ్చి ఉండండి అంటే ఎవరూ ఉండరు.. ఏ వ్యక్తీ ఒడిషాలో ఉండడానికో.. బీహార్ లో ఉండడానికో.. తిరుపతిలో ఉండడానికో ఇష్టపడడు.. అంటూ గతంలో తిరుపతిని కించపరిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తిరుపతి పార్లమెంట్ లో ఓట్లు అడిగే నైతిక హక్కు ఎక్కడిది?’’ అని పేర్కొంటూ మార్ఫింగ్ చేసిన వీడియోను దేవినేని ట్వీట్ చేశారు.