Sanjay Raut: మరో మంత్రిపై అవినీతి ఆరోపణలు చేస్తూ సచిన్ వాజే లేఖ.. సంజయ్ రౌత్ మండిపాటు!
- మహారాష్ట్ర హోంమంత్రి దేశ్‌ముఖ్ పై అవినీతి ఆరోపణలు
- ముంబై మాజీ సీపీ లేఖతో చివరకు సీబీఐ విచారణ
- ఇప్పుడు మరో మంత్రిపై అవినీతి ఆరోపణలు
- ఎన్ఐఏ కోర్టుకు సచిన్ వాజే లేఖ
- ప్రభుత్వాన్ని కూల్చేందుకు చూస్తున్నారన్న సంజయ్
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పై వచ్చిన అవినీతి ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఆయనపై ప్రాథమిక దర్యాప్తు జరపాలని సీబీఐకి బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అనిల్ దేశ్‌ముఖ్ నెలకు రూ.100 కోట్ల వసూళ్లను పోలీసులకు లక్ష్యంగా పెట్టారంటూ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేకు కొన్ని రోజుల క్రితం ముంబై మాజీ సీపీ పరంవీర్ సింగ్ లేఖ రాశారు.
ఇప్పుడు మరో మహారాష్ట్ర మంత్రిపై ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ముకేశ్ అంబానీకి బాంబు బెదిరింపుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కస్టడీలో ఉన్న పోలీసు అధికారి సచిన్ వాజే నిన్న సంచలన విషయాలు వెల్లడించారు. బార్లు, పబ్బుల నుంచి రూ.100 కోట్లు వసూలు చేసి ఇవ్వాలని తనకు అనిల్ దేశ్‌ముఖ్ నిర్దేశించారని అంగీకరించారు. అంతేకాదు, ఓ సంస్థ నుంచి రూ.50 కోట్లు వసూలు చేసి పెట్టాలని ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, శివసేన నేత అనిల్ పరబ్ తనకు పురమాయించారని పేర్కొన్నారు.
మరోవైపు, ఈ ఆరోపణలతో స్వయంగా రాసిన లేఖను నిన్న ఎన్‌ఐఏ కోర్టుకు హాజరైన సమయంలో అందజేసేందుకు యత్నించగా, జడ్జీ నిరాకరించి, నిబంధనల మేరకు నడుచుకోవాలని చెప్పారు. మహారాష్ట్రలోని సంకీర్ణ సర్కారులో భాగస్వామి అయిన ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ తనపై సస్పెన్షన్ వేటు వేయించాలని ప్రయత్నించారని కూడా సచిన్ వాజే ఆ లేఖలో పేర్కొన్నారు.
అయితే, శరద్ పవార్‌ను ఒప్పించే పూచీ తనదని అప్పటి హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తనకు హామీ ఇచ్చి, అందుకు గాను రూ.2 కోట్లు ఇవ్వాలని షరతు పెట్టారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తాను అంత డబ్బు ఇవ్వలేనని చెప్పగా, ఆ డబ్బును తరువాత ఇవ్వాలని దేశ్‌ముఖ్ కోరారన్నారు.
కాగా, ఓ సంస్థ నుంచి రూ.50 కోట్లు వసూలు చేసి పెట్టాలని వాజే తనపై చేసిన ఆరోపణలను రవాణా శాఖ మంత్రి పరబ్ ఖండించారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారన్నారు. మరోవైపు, మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణల కేసులో సచిన్ వాజేను విచారించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు సీబీఐకి అనుమతి మంజూరు చేసింది. అలాగే, వాజే కస్టడీని ఈ నెల 9వ తేదీ వరకు పొడిగించింది.
ఈ పరిణామాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడుతూ బీజేపీపై పరోక్షంగా ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకే కొందరు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఆ ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించబోవని తెలిపారు. జైల్లో ఉన్న నిందితుల నుంచి లేఖలు రావడం ఇప్పుడో కొత్త ట్రెండ్‌గా మారుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి చెత్త రాజకీయాలను తాను ఎన్నడూ చూడలేదని చెప్పుకొచ్చారు. ఇటువంటి సోకాల్డ్ లేఖలతో వ్యక్తుల పరువు, ప్రతిష్ఠలను తీయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తమ ప్రభుత్వాన్ని బలహీనపర్చాలన్నదే వారి ఉద్దేశమని విమర్శించారు.