Parishat Elections: ఏపీలో కొనసాగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్

Parishat elections polling in AP

  • నేడు రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
  • మధ్యాహ్నం 1 గంట వరకు 37.26 శాతం పోలింగ్
  • అత్యధికంగా విజయనగరం జిల్లాలో 44 శాతం ఓటింగ్
  • సాయంత్రం 5 గంటలకు ముగియనున్న ఓటింగ్

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ మార్గం సుగమం చేయడంతో నేడు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరుగుతోంది. ఏకగ్రీవాలు పోను 515 జడ్పీటీసీ స్థానాలు, 7220 ఎంపీటీసీ స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ జరుగుతోంది. కాగా, చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే సాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు చిత్తూరు జిల్లాలో 41.87 శాతం పోలింగ్ నమోదైంది. అదే సమయానికి విశాఖ జిల్లాలో 42.10 శాతం పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాష్ట్రవ్యాప్తంగా చూస్తే 37.26 శాతం ఓటింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. కోర్టు తదుపరి తీర్పు అనంతరం ఓట్ల లెక్కింపు ఉంటుంది.

అటు మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇతర జిల్లాల్లో నమోదైన పోలింగ్ వివరాలు ఇలా ఉన్నాయి... శ్రీకాకుళం జిల్లాలో 36.62, విజయనగరం జిల్లాలో 44.38, కడప జిల్లాలో 33.6, కర్నూలు జిల్లాలో 40.25 అనంతపురం జిల్లాలో 39.79, కృష్ణా జిల్లాలో 36.02, ప్రకాశం జిల్లాలో 27.44, తూర్పు గోదావరి జిల్లాలో 41, గుంటూరు జిల్లాలో 27.26, పశ్చిమ గోదావరి జిల్లాలో 41.9, నెల్లూరు జిల్లాలో 34.2 శాతం పోలింగ్ నమోదైంది.

కాగా, సినీ నటుడు మంచు విష్ణు చిత్తూరు జిల్లాలోని తన స్వస్థలంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు ఓటు వేయాలని, ఓటుకు డబ్బులు అడగడం సరికాదని అన్నారు. యువత ఓటేస్తే పరిస్థితిలో మార్పు వస్తుందని పేర్కొన్నారు. అటు, ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట మండలం మబగాం గ్రామంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఓటేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత ప్రాధాన్యతాంశం అని అన్నారు.

  • Loading...

More Telugu News