Sri Lanka: 'మిసెస్ వరల్డ్'ను అదుపులోకి తీసుకున్న శ్రీలంక పోలీసులు
- మిసెస్ శ్రీలంక పోటీల్లో నాటకీయ పరిణామాలు
- పుష్పికను విజేతగా ప్రకటించిన న్యాయనిర్ణేతలు
- తిరస్కరించిన మాజీ మిసెస్ శ్రీలంక
- కిరీటాన్ని లాక్కొని రన్నరప్‌కు తొడిగిన వైనం
- పుష్పిక అర్హురాలు కాదని వాదన
శ్రీలంకలో ఇటీవల జరిగిన మిసెస్ శ్రీలంక 2020 పోటీల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. న్యాయనిర్ణేతలు ప్రకటించిన వ్యక్తికి కాకుండా రన్నరప్‌కు కిరీటం తొడిగిన కరోలినా (ఈమె 2019లో మిసెస్ శ్రీలంక) వేడుకలో నానా హంగామా సృష్టించారు.
వివరాల్లోకి వెళితే... ఆదివారం కోలంబోలో మిసెస్ శ్రీలంక పోటీలు జరిగాయి. న్యాయనిర్ణేతలు పుష్పికా డీ సిల్వా అనే వ్యక్తిని విజేతగా ప్రకటించారు. ఆమెకు కిరీటం కూడా తొడిగారు. కానీ, అంతలోనే వేదికపైకి వచ్చిన ప్రస్తుత 'మిసెస్ వరల్డ్', '2019 మిసెస్ శ్రీలంక' కరోలినా అనూహ్యంగా ప్రవర్తించారు. పుష్పిక కిరీటాన్ని లాక్కొని రన్నరప్‌గా నిలిచిన మరో వ్యక్తికి తొడిగారు. ఈ క్రమంలో పుష్పికకు గాయాలు కూడా అయ్యాయి. 2019లో మిసెస్ శ్రీలంక అయిన కరోలినా 2020లో మిసెస్ వరల్డ్‌గా ఎంపికవడం గమనార్హం.
అయితే, పెళ్లి చేసుకొని విడాకులు తీసుకోని వ్యక్తి మాత్రమే మిసెస్ శ్రీలంక పోటీలకు అర్హులని కరోలినా చెప్పుకొచ్చారు. అందుకే పుష్పిక విజేత కాదని తెలిపారు. దీన్ని తీవ్ర అవమానంగా భావించిన పుష్పిక అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్లిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు కరోలినాతో పాటు ఆమెకు సహకరించిన ఆమె సహచరి చులా మనమేంద్ర అనే మరో మోడల్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
చివరకు న్యాయనిర్ణేతలు పుష్పికనే విజేతగా తేల్చారు. ఇక బహిరంగ క్షమాపణ కోరితే కేసు వాపస్ తీసుకుంటానని పుష్పిక తెలపగా.. అందుకు కరోలినా తిరస్కరించారు. ఇరువురు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు.