Khammam: వైఎస్ షర్మిల ఇంటి వద్ద మొదలైన సందడి!
- నేడు ఖమ్మంలో సంకల్ప సభ
- ఏర్పాట్లు పూర్తి చేసిన అనుచరగణం
- ఉదయం 8 గంటలకు బయలుదేరనున్న కాన్వాయ్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయగా, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరిగా పరిచయం అక్కర్లేని వైఎస్ షర్మిల, నేడు ఖమ్మంలో సంకల్ప సభను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ సభ సాయంత్రం 5 గంటల తరువాత జరగనుండగా, ఈ ఉదయం 8 గంటలకు ఆమె రోడ్డు మార్గాన ఖమ్మం బయలుదేరనున్నారు.
ఉదయం 8 గంటలకు షర్మిల కాన్వాయ్ బయలుదేరనుండగా, ఆమె వెంట తరలి వెళ్లేందుకు ఇప్పటికే భారీ ఎత్తున షర్మిల అభిమానులు ఆమె నివాసం వద్దకు చేరుకోవడంతో సందడి మొదలైంది. వందల కొద్దీ వాహనాలు ఆమెతో పాటు బయలుదేరి వెళ్లనున్నాయి.
ఈ ఉదయం 8 గంటలకు లోటస్ పాండ్ నుంచి బయలుదేరే షర్మిల కాన్వాయ్ లక్డీకాపూల్, కోఠి, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్ మీదుగా ప్రయాణించి, 9.30 గంటలకు హయత్ నగర్ చేరుకుంటుంది. అక్కడ ఆమె అభిమానుల స్వాగతాన్ని స్వీకరిస్తారు. ఆపై చౌటుప్పల్, నకిరేకల్, సూర్యాపేట మీదుగా ఆమె కాన్వాయ్ సాగనుంది.
దారిపొడవునా షర్మిలకు ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. సూర్యాపేట దాటిన తరువాత చివ్వెంల వద్ద ఆమె మధ్యాహ్న భోజన విరామం తీసుకుని, నామవరం, నాయకన్ గూడెం మీదుగా సాయంత్రం 5.15 గంటలకు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుంటారు.
ఇక ఈ సభను విజయవంతం చేయాలన్న ప్రణాళికతో వైఎస్ఆర్, షర్మిల అభిమానులు, కొండా రాఘవరెడ్డి, సతీశ్ రెడ్డి వంటి వారి నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు. ఈ సభకు వైఎస్ భార్య విజయమ్మ కూడా హాజరు కానుండడం ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఇక ఈ సభలోనే తెలంగాణలో తాను పార్టీని పెట్టబోయే తేదీ గురించిన వివరాలను షర్మిల వెల్లడిస్తారని ఆమె వర్గం నేతలు అంటున్నారు.