Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసన.. టీడీపీ కార్పొరేటర్ల పాదయాత్ర
- అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి కాగడాలతో పాదయాత్ర
- ఉక్కు పరిశ్రమ పోరాట కమిటీ సభ్యుల సంఘీభావం
- పరిశ్రమ ప్రైవేటు చేతుల్లోకి వెళ్తే కార్మికులు అన్యాయమై పోతారని ఆవేదన
విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా వైజాగ్‌లో టీడీపీ కార్పొరేటర్లు ఈ ఉదయం పాదయాత్ర నిర్వహించారు. ఈ తెల్లవారుజామున కూర్మన్నపాలెం జంక్షన్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన కార్పొరేటర్లు కాగడాలతో పాదయాత్ర చేపట్టారు. అక్కడి నుంచి నగరపాలక సంస్థ వరకు పాదయాత్రగా చేరుకున్నారు.
టీడీపీ కార్పొరేటర్లు చేపట్టిన ఈ పాదయాత్రలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు కూడా పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కౌన్సిల్‌లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ అధీనంలోనే ఉండాలని, లేదంటే కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు.