Election Commission: బలగాలను అవమానిస్తారా?.. బెంగాల్ సీఎం మమతకు ఈసీ మరో నోటీసు

Vilifying troops Mamata Banerjee gets another EC notice

  • కేంద్ర బలగాలపై మమత తీవ్ర ఆరోపణలు
  • గ్రామస్థులపై అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శలు
  • మహిళలపైనా వేధింపులకు దిగుతున్నారని ఆరోపణ
  • మండిపడిన ఈసీ.. 10లోపు వివరణ ఇవ్వాలని ఆదేశం
  • బలగాల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని కామెంట్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మరో నోటీసు ఇచ్చింది. పోలింగ్ బూత్ ల వద్ద విధులు నిర్వర్తిస్తున్న కేంద్ర పారామిలటరీ బలగాల మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బలగాలను అవమానిస్తారా? అంటూ మండిపడిన ఈసీ..  ఈ నెల 10లోపు వివరణ ఇవ్వాల్సిందిగా మమతను ఆదేశించింది.

మార్చి 28న నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా.. కేంద్ర పారామిలటరీ బలగాలకు అన్ని అధికారాలు ఎవరిచ్చారంటూ మమత ప్రశ్నించారు. మహిళలను ఓటేయకుండా బెదిరించారని, ఆ అధికారం వారికెక్కడిదని ప్రశ్నించారు. 2016, 2019లోనూ ఇలాగే జరిగిందని ఆరోపించారు. 7న హూగ్లీ జిల్లాలో నిర్వహించిన ప్రచారంలో మరింత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర బలగాలు అమిత్ షా ఆదేశాలతో పనిచేస్తున్నాయని, గ్రామస్థులపై అరాచకాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. మహిళలపైనా వేధింపులకు పాల్పడుతున్నారని, బీజేపీకి ఓటేయాలంటూ వారు ఒత్తిడి చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.

ఆ వ్యాఖ్యలపై మండిపడిన ఈసీ.. రెచ్చగొట్టే విధంగా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారంటూ తాజా నోటీసుల్లో వ్యాఖ్యానించింది. కేంద్ర బలగాలను తిట్టడం, వారిని అవమానించడం మంచిది కాదని పేర్కొంది. దాని వల్ల బలగాల్లో మనోస్థైర్యం దెబ్బతింటుందని వ్యాఖ్యానించింది. కాగా, ముస్లింలంతా తృణమూల్ కే ఓటేయాలన్న మమత వ్యాఖ్యలపై అంతకుముందు బుధవారం ఈసీ నోటీసులిచ్చింది.

  • Loading...

More Telugu News