Jagan: ఎన్నికలు అయిపోయాయి... ఇక వ్యాక్సినేషన్ ముమ్మరం చేయండి: సీఎం జగన్
- ఏపీలో ముగిసిన స్థానిక ఎన్నికలు
- కరోనా పరిస్థితులపై దృష్టి సారించిన సీఎం జగన్
- ఈ నెల 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్
- రోజుకు 6 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని ఆదేశం
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాయి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ఇటీవలే పూర్తి కాగా, నిన్న పరిషత్ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఆ ఫలితాలు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఏపీలో కరోనా పరిస్థితులపై దృష్టి సారించారు. ఎన్నికలు అయిపోయాయని, ఇక రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ను ముమ్మరం చేయాలని అధికారులకు నిర్దేశించారు.
ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు కేంద్రం ఆదేశాలతో టీకా ఉత్సవ్ చేపట్టాలని, రోజుకు 6 లక్షల మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. టీకా ఉత్సవ్ జరిగే 4 రోజుల్లో 24 లక్షల మందికి వ్యాక్సిన్ డోసులు అందించాలని ఆదేశించారు. టీకా ఉత్సవ్ ముగిశాక వ్యాక్సిన్ డోసుల కొరత ఏర్పడితే కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని సూచించారు.