YS Sharmila: జులై 8న పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటిస్తా: వైఎస్ షర్మిల
- ఖమ్మంలో షర్మిల సంకల్ప సభ
- వైఎస్ జయంతి సందర్భంగా పార్టీ ప్రకటన
- తెలంగాణలో నిలబడతానని షర్మిల ధీమా
- తాను ఒంటరి కాదని, ప్రజలు తోడున్నారని వెల్లడి
- సింహం సింగిల్ గానే వస్తుందని వ్యాఖ్యలు
తాను స్థాపించబోయే పార్టీ పేరును షర్మిల ఇవాళ ఖమ్మం సభలో ప్రకటిస్తారని ఆశించిన అభిమానులకు నిరాశ ఎదురైంది. ఆమె తన రాజకీయ పార్టీ పేరును జూలై 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రకటిస్తానని వెల్లడించారు. అదే రోజున పార్టీ జెండా, అజెండా ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయకపోతే నిరాహార దీక్ష చేస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నెల 15 నుంచి మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేపడుతున్నట్టు వెల్లడించారు. బరాబర్ తెలంగాణలో నిలబడతానని, తెలంగాణ ప్రజల సమస్యల కోసం కొట్లాడతానని షర్మిల ఉద్ఘాటించారు.
పదవుల కోసం కాదు, ప్రజల కోసం నిలబడతానని స్పష్టం చేశారు. ఎలాంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్నయినా తాను అడ్డుకుంటానని అన్నారు. తనకు అవకాశం ఇవ్వాలో, వద్దో ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. నేటి కార్యకర్తలే రేపటి నాయకులని అభిమానుల్లో ఉత్సాహం కలిగించే ప్రయత్నం చేశారు.
"ఈ గడ్డ మీదే గాలి పీల్చా, ఈ గడ్డ మీదే నీళ్లు తాగా... నా పిల్లలను ఇక్కడే కన్నాను. ఈ గడ్డకు సేవ చేయాలనుకోవడం, రుణం తీర్చుకోవాలనుకోవడం తప్పా?" అని ప్రశ్నించారు. కాగా తన పార్టీ తెలంగాణ ప్రజల పార్టీ అని, మనసా వాచా కర్మణా ప్రజల కోసమే పనిచేసే పార్టీ అని, దీనికి అందరి ఆశీస్సులు అవసరమని అన్నారు. అంతేకాదు సింహం సింగిల్ గానే వస్తుందంటూ అభిమానుల్లో జోష్ పెంచారు. "మీరు ఒంటరి కాదు, నేను తోడున్నా... అలాగే నేను కూడా ఒంటరిని కాదు, నాకు మీరు తోడున్నారు" అంటూ వివరించారు.