Mumbai: ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు... షాపులు తెరిచే తీరుతామంటున్న ముంబై వ్యాపారులు!
- వారాంతంలో లాక్ డౌన్ పెట్టిన మహారాష్ట్ర
- మాల్స్, మల్టీప్లెక్స్ లు, మార్కెట్ల మూసివేత
- సోమవారం నుంచి దుకాణాలు తెరిచే తీరుతాం
- గత సంవత్సరం ఎంతో నష్టపోయామంటున్న వాణిజ్య సంఘాలు
కరోనా కేసులు పెరుగుతున్న వేళ, రాష్ట్రవ్యాప్త లాక్ డౌన్ ను విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా, వాణిజ్య సంఘాలు ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ మేరకు మహారాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ (ఎంఏసీసీఐఏ) ఓ ప్రకటన చేస్తూ, సోమవారం నుంచి తాము దుకాణాలన్నీ తెరుస్తామని హెచ్చరించింది. రాష్ట్రంలోని దాదాపు 800కు పైగా వాణిజ్య, పరిశ్రమ సంఘాలు ఎంఏసీసీఐఏ కింద పని చేస్తుండటం గమనార్హం.
మహారాష్ట్ర ప్రభుత్వం మాల్స్, మల్టీప్లెక్స్ లు, మార్కెట్లు, నిత్యావసరాలు మినహా మిగిలిన దుకాణాలను మూసివేయాలని, వారాంతంలో పూర్తి లాక్ డౌన్ అమలవుతుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై వర్తక సంఘాలతో పాటు ఆతిథ్య రంగంలోని కంపెనీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. తాము సోమవారం నుంచి దుకాణాలు తెరుస్తామని ఎంఏసీసీఐఏ ప్రతినిధులు స్పష్టం చేస్తుండగా, ఇతర ముఖ్య వర్తక సంఘాలు సీఏఐటీ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్), ఎఫ్ఆర్టీడబ్ల్యూఏ (ఫెడరేషన్ ఆఫ్ రిటైల్ ట్రేడర్స్ వెల్ ఫేర్ అసోసియేషన్) మాత్రం ఈ నిర్ణయాన్ని తిరస్కరిస్తున్నాయి.
గడచిన బుధవారం నాడు వివిధ ట్రేడ్ అసోసియేషన్ల ప్రతినిధులతో సమావేశమైన ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, తమ నిర్ణయాన్ని వెలువరించగా, కొన్ని సవరణలు కావాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం నాడు సీఎం కొన్ని సవరణలను ప్రకటిస్తారని భావిస్తున్నామని ఎంఏసీసీఐఏ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లలిత్ గాంధీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం సవరణలను ప్రకటించకున్నా, దుకాణాలను తెరవాలని తాము నిర్ణయించామని, ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
పండగ సీజన్ లో షాపుల మూసివేత కారణంగా తాము తీవ్రంగా నష్టపోతామని, ఇప్పటికే గత సంవత్సరం నెలకొన్న పరిస్థితులతో భారీ నష్టాల్లో ఉన్న తాము, మరోసారి కష్టాల్లోకి జారాలని భావించడం లేదని, అన్ని రకాల వాణిజ్య కేంద్రాలను మూసివేయడం సహేతుకం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో తాము ప్రభుత్వం నుంచి ప్రకటన కోసం ఎదురు చూస్తున్నామని, ముఖ్యమంత్రిపై తమకు గౌరవం ఉందని, తాము చట్టాన్ని అతిక్రమించాలని భావించడం లేదని ఎఫ్ఆర్టీడబ్ల్యూఏ ప్రతినిధి వీరేన్ షా వ్యాఖ్యానించారు.