New Delhi: మరో మార్గం లేక... కఠిన నిబంధనలను విధించిన ఢిల్లీ సర్కారు!
- రెస్టారెంట్లు, థియేటర్లు, రవాణా వాహనాలపై ఆంక్షలు
- ఏప్రిల్ 30 నుంచి అమలులోకి
- పెళ్లికి 50 మంది, అంత్యక్రియలకు 20 మందికే అనుమతి
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేజ్రీవాల్ సర్కారు
కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న వేళ, కట్టడి చేసేందుకు మరో మార్గం కనిపించని పరిస్థితుల్లో, ప్రజలపై పలు రకాల నిబంధనలను ఢిల్లీ సర్కారు విధించింది. ప్రజలు సామూహికంగా పాల్గొనే పలురకాల కార్యక్రమాలను నిషేధించింది. రెస్టారెంట్లు, థియేటర్లు, ప్రజా రవాణా విషయాల్లో పరిమితులతో పాటు వివాహాలు, అంత్యక్రియలు తదితరాలకు హాజరయ్యే వారి సంఖ్యపై అవధులు విధించింది.
కొత్త రూల్స్ ఈ నెల 30 నుంచి అమలులోకి వస్తాయి. ఇటీవల అమల్లోకి తెచ్చిన రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ, సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక, మతపరమైన సమావేశాలపై నిషేధాలకు తోడు కొత్త నిబంధనలన్నీ అమలులోకి రానున్నాయి. వివాహానికి 50 మందిని, అంత్యక్రియలకు 20 మందిని మాత్రమే అనుమతిస్తారు. రెస్టారెంట్లు, థియేటర్లలో మొత్తం కెపాసిటీలో 50 శాతం మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. బస్సులు, మెట్రోల్లకూ ఇదే నిబంధన వర్తిస్తుంది.
ఇక జాతీయ, అంతర్జాతీయ పోటీల కోసం ఆటగాళ్లు శిక్షణ తీసుకుంటున్న ఈత కొలనులు మినహా మిగతావన్నీ మూసివేయాలి. స్టేడియంలలో క్రీడల పోటీలకు వీక్షకులను అనుమతించరాదు. ఇప్పటికే ఢిల్లీ పరిధిలోని కాలేజీలు, పాఠశాలలను ప్రభుత్వం మూసివేసిందన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రేడ్-1 అధికారులు మినహా, మిగతా ఉద్యోగుల్లో సగం మంది మాత్రమే కార్యాలయాలకు హాజరు కావాలి.
ఇదే సమయంలో ఆరోగ్య, పోలీసు, హోమ్ గార్డ్, సివిల్ డిఫెన్స్, అగ్నిమాపక, అత్యవసర సేవలు మాత్రం ఎటువంటి ఆటంకాలు లేకుండా అందుతాయని ఢిల్లీ సర్కారు ప్రకటించింది. ప్రైవేటు కంపెనీలు షిఫ్ట్ ల ప్రకారం, ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుని పని చేయాలని, వర్క్ ఫ్రమ్ హోమ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. మహారాష్ట్ర నుంచి విమానాల్లో ఢిల్లీకి వచ్చే వారు కనీసం మూడు రోజుల ముందు తీసుకున్న ఆర్టీ-పీసీఆర్ నెగటివ్ టెస్ట్ రిపోర్టును తీసుకుని రావాల్సి ఉంటుందని పేర్కొంది. టెస్ట్ రిపోర్టు తీసుకుని రాకుంటే, 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరని, ప్రభుత్వ పనుల నిమిత్తం వచ్చే వారికి మాత్రం అనుమతి ఉంటుందని తెలిపింది.