Srinivasananda Saraswathi: జగన్ తన బావ ద్వారా రాష్ట్రంలో మతమార్పిళ్లు చేయిస్తున్నారు: శ్రీనివాసానంద సరస్వతి
- తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం
- ఏపీలో క్రైస్తవ పాలన కొనసాగుతోందన్న శ్రీనివాసానంద
- హిందూ మతాన్ని నాశనం చేస్తున్నారని వెల్లడి
- జగన్ కుటుంబం చాపకింద నీరులా దెబ్బతీస్తోందని ఆగ్రహం
- వైవీ సుబ్బారెడ్డి ఎవరికి ప్రతినిధి? అంటూ మండిపాటు
ఏపీ సీఎం జగన్ పైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ధ్వజమెత్తారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్ తన బావ (బ్రదర్ అనిల్ కుమార్) సాయంతో ఏపీలో మతమార్పిళ్లు చేయిస్తున్నారని ఆరోపించారు. తద్వారా రాష్ట్రంలో క్రైస్తవ ఓటు బ్యాంకును పెంచుకుంటారని వివరించారు.
రాష్ట్రంలో బ్రిటీష్ వారిని మించిన రీతిలో క్రైస్తవ పాలన కొనసాగుతోందని, సీఎం జగన్ కుటుంబ సభ్యులు చాపకింద నీరులా హిందూ మతాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. శ్రీశైలం ఇప్పటికే అన్యమతస్తుల చేతికి వెళ్లిపోయిందని, మంత్రి కొడాలి నాని మాటలు హిందువుల మనసులను గాయపరిచాయని అన్నారు. రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు జరిగినా అరెస్టులు లేకపోవడం దారుణమని శ్రీనివాసానంద పేర్కొన్నారు. హిందూమత రక్షణపై మాట్లాడినందుకు ఎల్వీ సుబ్రహ్మణ్యంను అవమానకర రీతిలో సాగనంపారని విమర్శించారు.
తిరుపతి ఉప ఎన్నికలో రాష్ట్ర ప్రభుత్వానికి హిందువులు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. హిందువుల మనోభావాలను గౌరవించే పార్టీకి ఓటేయాలని సూచించారు.
ఇక, టీటీడీ వైఖరిపైనా శ్రీనివాసానంద సరస్వతి విమర్శనాస్త్రాలు సంధించారు. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మనా లేక సర్వమత ప్రతినిధా అని ప్రశ్నించారు. ఓవైపు వెంకన్న దయ అంటూనే మరోవైపు అల్లా, ఏసు అంటున్న వైవీ సుబ్బారెడ్డి హిందువుల మనోభావాలకు భంగం కలిగిస్తున్నారని మండిపడ్డారు. కరోనా కారణంగా చూపుతూ తిరుమల వెంకటేశ్వరుడి ఉచిత దర్శనాన్ని రద్దు చేసిన టీటీడీ పాలకమండలి... రూ.300 దర్శనాలు కొనసాగించడం వారి వ్యాపార ధోరణికి నిదర్శనమని అన్నారు.