Swapna: పని ఒత్తిడి.. ఆఫీసులోనే ఉరేసుకున్న కెనరా బ్యాంక్ మేనేజర్
- ఒత్తిడిని తట్టుకోలేక పోయిన స్వప్న
- డైరీలో రాసుకుని ఆత్మహత్య
- కేరళలోని కన్నూర్ సమీపంలో ఘటన
తాను మేనేజర్ గా పని చేస్తున్న బ్యాంకులో పని ఒత్తిడిని తట్టుకోలేక పోయిన ఓ యువతి, అక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కేరళలోని కన్నూర్ సమీపంలో గల తొక్కిలంగడిలో తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు తెలియజేసిన మరిన్ని వివరాల్లోకి వెళితే, ఇక్కడ ఉన్న బ్యాంకులో స్వప్న (38) మేనేజర్ గా పని చేస్తున్నారు. గత వారాంతంలో ఉదయం 9 గంటలకు మరో బ్యాంకు ఉద్యోగి పని నిమిత్తం వెళ్లగా, స్వప్న ఉరి వేసుకుని కనిపించడంతో అవాక్కై, అలారం మోగించారు. దీంతో స్థానికులు, ఇతర బ్యాంకు సిబ్బంది హుటాహుటిన వచ్చి, ఆమెను ఆసుపత్రికి తరలించినా, లాభం లేకపోయింది.
అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న కుతుంపరంబా ఏసీపీ కేజీ సురేష్ నేతృత్వంలోని పోలీసు బృందం, బ్యాంకుకు చేరుకుని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఆపై స్వప్న నిత్యమూ రాసుకునే డైరీని స్వాధీనం చేసుకున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాలూకా ఆసుపత్రికి తరలించారు. పనిలో పెరిగిపోయిన ఒత్తిడిని తట్టుకోలేకనే ఆమె ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నట్టు డైరీలో రాసుకుందని అన్నారు. కాగా, గత సంవత్సరం ఆమెకు తొక్కిలంగడి శాఖలో పోస్ట్ చేయబడ్డారు. కన్నూర్ లో తన ఇద్దరు బిడ్డలతో కలిసి ఆమె నివశిస్తుండగా, తల్లి మృతితో పిల్లలు అనాధలయ్యారు.