Parthasarathi: ఏపీలో అమలవుతున్న పథకాలు చూస్తే దేశంలోని పేదలు జగన్ ప్రధానిగా రావాలని కోరుకుంటారు: వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి
- ఉత్తమ సేవలు అందిస్తున్న వలంటీర్లకు అవార్డులు
- కృష్ణా జిల్లా పోరంకిలో కార్యక్రమం
- సీఎం జగన్ పై ఎమ్మెల్యే పార్థసారథి ప్రశంసలు
- దేశమంతా ఏపీ వైపు చూస్తోందని వ్యాఖ్యలు
ఏపీలో ఉత్తమ వలంటీర్లకు అవార్డులు అందించే కార్యక్రమాన్ని ఏపీ సీఎం జగన్ కృష్ణా జిల్లా పోరంకిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ వలంటీర్ వ్యవస్థ ఖ్యాతి జాతీయస్థాయికి చేరిందని, ప్రధాని మోదీ కూడా వలంటీర్ వ్యవస్థను అభినందించారని తెలిపారు.
ఏపీలో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను చూస్తే దేశంలోని పేదలు జగన్ ప్రధానిగా రావాలని కోరుకుంటారని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని బంగారు భవిత దిశగా సీఎం జగన్ నడిపిస్తున్నారని, ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతుండడం పట్ల దేశమంతా ఏపీ వైపు చూస్తోందని పార్థసారథి అన్నారు. జగన్ రాకతో గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం సాకారమవుతోందని పేర్కొన్నారు.
కాగా, దేశంలోని పేదలు జగన్ ను ప్రధానిగా రావాలని కోరుకుంటారని పార్థసారథి వ్యాఖ్యానించిన సమయలో సీఎం జగన్ వేదికపైనే ఉన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు వలంటీర్ల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం కాగా, సీఎం జగన్ చిరునవ్వుతో తన స్పందన తెలియజేశారు.