West Bengal: వీల్చైర్లో కూర్చొని ధర్నా ప్రారంభించిన మమతా బెనర్జీ
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మమత అభ్యంతరకర వ్యాఖ్యలు
- ఒకరోజు ప్రచారంలో పాల్గొనకుండా ఈసీ నిషేధం
- కోల్కతాలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొంటున్న సీఎం మమతా బెనర్జీ తన ప్రసంగాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన అభియోగంపై ఒకరోజు పాటు ప్రచారంలో పాల్గొనకూడదంటూ ఎన్నికల సంఘం నిషేధం విధించిన విషయం తెలిసిందే. బెంగాల్లో ముస్లింలంతా కలిసి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులకే ఓటేయాలని ఆమె అనడంతో పాటు కేంద్ర బలగాలను ఘెరావ్ చేయాలని, వారిపై తిరగబడాలని ప్రజలను రెచ్చగొట్టడం వంటి వ్యాఖ్యలు చేయడంపై ఈసీ ఆ నిర్ణయం తీసుకుంది.
అయితే, తాను ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించానంటూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై ధర్నా చేస్తానని ఇప్పటికే ప్రకటించిన మమతా బెనర్జీ చెప్పినట్లుగానే ధర్నాకు దిగారు. కోల్కతాలోని గాంధీ విగ్రహం దగ్గర వీల్చైర్లో కూర్చొని ఆమె ఇందులో పాల్గొంటున్నారు. మరోవైపు, బెంగాల్లో ఎన్నికలు జరగనున్న నియోజక వర్గాల్లో టీఎంసీ ఇతర నేతలు ప్రచార కార్యక్రమాల్లో యథావిధిగా పాల్గొంటున్నారు.