Amit Shah: గూర్ఖాలు భయపడొద్దు.. మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం: అమిత్ షా హామీ

BJP will find a permanent solution to the Gorkha problem says Amit Shah in Bengal election rally

  • గూర్ఖాలు మళ్లీ ఆందోళన చేయాల్సిన పరిస్థితి రాకుండా చూస్తాం
  • ఎన్నార్సీ గురించి గూర్ఖాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
  • మమతా బెనర్జీ ఎందరినో చంపించారు

పశ్చిమబెంగాల్ లో బీజేపీ అధికారంలోకి వస్తే ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న గూర్ఖాల సమస్యకు ముగింపు పలుకుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. మన దేశ రాజ్యాంగం చాలా విశాలమైనదని... ఏ సమస్యనైనా పరిష్కరించుకునేందుకు రాజ్యాంగంలో చోటు ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే గూర్ఖా సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని అందిస్తామని మాట ఇస్తున్నానని తెలిపారు.

కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు... ఆ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం గూర్ఖా సమస్యను పరిష్కరిస్తుందని అమిత్ షా చెప్పారు. మీ సమస్యల పరిష్కారం కోసం గుర్ఖాలు ఎవరూ మళ్లీ ఆందోళన చేయాల్సిన పరిస్థితి రాకుండా చూస్తామని తెలిపారు. బెంగాల్ లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  

ప్రత్యేక రాష్ట్రం కోసం దశాబ్దాలుగా గూర్ఖాలు ఆందోళనలు చేస్తున్నారు. 2017 నుంచి వాళ్లు వారి ఉద్యమాన్ని మళ్లీ తీవ్రతరం చేశారు. మరోవైపు అమిత్ షా మాట్లాడుతూ, గూర్ఖాలకు ఎవరూ హాని తలపెట్టలేరని భరోసా ఇచ్చారు. ఎన్నార్సీని అమలు చేసే కార్యక్రమం ఇంకా మొదలు కాలేదని... ఒకవేళ ఆ కార్యక్రమం ప్రారంభమైనా గూర్ఖాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

గూర్ఖాలు అత్యధిక సంఖ్యలో ఉండే డార్జిలింగ్ ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫుల్ స్టాప్ పెట్టారని విమర్శించారు. మమత ఎందరినో చంపించారని, మరెందరిపైనో కేసులు పెట్టించారని... బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు ఎదుర్కొంటున్న వారందరికీ విముక్తి కలిగిస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News