Lockdown: మహారాష్ట్రలో ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్..?
- మహారాష్ట్రలో కరోనా బీభత్సం
- లాక్ డౌన్ నిర్ణయం దిశగా సర్కారు యోచన
- ఇప్పటికే అఖిలపక్షానికి తెలియజేసిన సీఎం
- ఈ రాత్రికి ప్రకటన వెలువడే అవకాశం
దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రం మహారాష్ట్ర. మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోల్చితే మహారాష్ట్రలో రెట్టింపు సంఖ్యలో పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇప్పుడు సెకండ్ వేవ్ లోనూ మహారాష్ట్ర కొత్త కేసుల తాకిడితో విలవిల్లాడుతోంది. నిన్న ఒక్కరోజే 51,751 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రేపటి నుంచి ఈ నెల 30 వరకు మహారాష్ట్రలో లాక్ డౌన్ విధించేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం.
దీనిపై సీఎం ఉద్ధవ్ థాకరే ఈ రాత్రికి ప్రకటన చేసే అవకాశం ఉంది. కనీసం 15 రోజులైనా లాక్ డౌన్ అమలు చేయకపోతే కరోనా వ్యాప్తిని కట్టడి చేయలేమని, అంతకుమించి మరో మార్గం లేదని మహా సర్కారు భావిస్తోంది. ప్రజలు సిద్ధంగా ఉండాలని సర్కారు నుంచి సంకేతాలు అందాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని సీఎం ఇప్పటికే అఖిలపక్షానికి తెలియజేశారు.
మహారాష్ట్రలో ఇప్పటివరకు 30 లక్షల 46 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, 58 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇటీవల కాలంలో మహారాష్ట్రలో మరోసారి ఉద్థృతస్థాయిలో కొత్త కేసులు వస్తుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అటు, మహారాష్ట్ర తరహాలోనే కరోనాతో అల్లాడిపోతున్న ఢిల్లీలోనూ లాక్ డౌన్ పెట్టేందుకు అరవింద్ కేజ్రీవాల్ సర్కారు సిద్ధమవుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.