Karnataka: మాటమార్చిన రమేశ్ జార్కిహోళి రాసలీలల వీడియోలోని యువతి?
- తనను మరోసారి విచారించాలన్న యువతి
- వీడియోలో హనీట్రాప్ అని చెప్పినట్టు వార్తలు
- బాధిత యువతి వీడియో ఎలా బయటకు వచ్చింది?
- సిట్ ను ప్రశ్నించిన యువతి న్యాయవాది
కర్ణాటక మంత్రి రమేశ్ జార్కిహోళితో అశ్లీల వీడియోల్లో కనిపించిన యువతి, ఇటీవల పోలీసుల విచారణలో తాను హనీట్రాప్ కు పాల్పడ్డానని చెప్పిన మాటలు అవాస్తవమని ప్రకటించి కలకలం రేపింది. తాను ఒత్తిడి వల్లే అలా చెప్పానని, ఇప్పుడు మరోసారి తనను విచారించాలని, కేసును ఎంక్వయిరీ చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను కోరింది.
రమేశ్ జార్కిహోళిపై గతంలో తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి వున్నానని వెల్లడించిన ఆమె, తానేమీ హనీ ట్రాప్ కు పాల్పడలేదని తాజాగా పేర్కొంది. సిట్ ముందు చెప్పిన విషయాలపై తాను ప్లేట్ ఫిరాయించడం లేదని అంది.
కాగా, సదరు యువతి సిట్ విచారణలో చెప్పిన కొంతభాగం వీడియో బయటకు వచ్చి వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె, తాను రమేశ్ ను హనీట్రాప్ చేశానని చెబుతున్నట్టు ఉండటం గమనార్హం. ఈ వీడియో బయటకు రావడంపై ఆమె తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఓ బాధిత యువతి వీడియోలో కొంతభాగం ఎలా బయటకు వచ్చిందని, హనీట్రాప్ వార్తలు వదంతులేనని, కోర్టును, తన క్లయింట్ ను మోసగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సిట్ పనిచేస్తోందని, విచారణ అధికారుల చేతులను ప్రభుత్వం కట్టేసిందని అన్నారు.