Devineni Uma: నెల్లూరులో ఉన్న దేవినేని ఉమ 10 నిమిషాల్లో కర్నూలుకు ఎలా వెళతారు?: తెలుగుదేశం పార్టీ
- కర్నూలులోని కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని దేవినేనికి నోటీసులు
- ఉదయం 10.20కి ఇంటికి నోటీసులు అంటించిన పోలీసులు
- ఉదయం 10.30కి విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్న వైనం
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ మాట్లాడిన మాటలను వక్రీకరించారంటూ నోటీసులు ఇచ్చారు.
ట్విట్టర్ లో దేవినేని ఉమ పోస్ట్ చేసిన వీడియో నకిలీదని ఫ్యాక్ట్ చెక్ ద్వారా తేలిందంటూ సీఐడీకీ ఫిర్యాదు అందింది. దీంతో ఆయనపై 464, 465, 468, 471, 505 సెక్షన్ల కింద సీఐడీ కేసు నమోదు చేసింది. కర్నూలులోని తమ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలంటూ ఈ ఉదయం 10.20కి నోటీసులిచ్చింది. దీనిపై తెలుగుదేశం పార్టీ మండిపడింది.
తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లాలో ఉన్న దేవినేని ఉమకు ఒక కేసు విషయమై నోటీసులు ఇవ్వాల్సిన పోలీసులు ఉదయం 10.20 గంటలకు గొల్లపూడిలోని ఆయన ఇంటికి నోటీసు అంటించారని టీడీపీ తెలిపింది. ఆశ్చర్యం ఏమిటంటే, ఉదయం 10.30 గంటలకల్లా కర్నూలు సీఐడీ ఆఫీసులో ఉండాలని ఆ నోటీసులో ఉందని ఎద్దేవా చేసింది. తిరుపతి ప్రచారంలో ఉన్న వ్యక్తికి విజయవాడలో నోటీసు ఇచ్చిన విషయం తెలియడానికే 10 నిమిషాలు పడుతుందని... అలాంటిది నెల్లూరులో ఉన్న వ్యక్తి 10 నిమిషాల్లో కర్నూలుకు ఎలా వెళ్లగలడని ప్రశ్నించింది. కక్ష సాధింపుకు కూడా ఒక హద్దు ఉండాలి కదా? అని వ్యాఖ్యానించింది.