Bipin Rawat: ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా బలగాలు వైదొలగుతుండటంపై ఇండియన్ మిలిటరీ చీఫ్ ఆందోళన!
- మే 1 నుంచి బలగాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన బైడెన్
- ఆటంకవాదులు మళ్లీ ప్రవేశించే అవకాశం ఉందన్న జనరల్ రావత్
- ఇప్పటి వరకు ఆఫ్ఘాన్ లో 2,400 మంది అమెరికా సైనికుల మృతి
తాలిబాన్ తీవ్రవాదులను అణచి వేసేందుకు అమెరికా బలగాలు రెండు దశాబ్దాలుగా అక్కడ ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే, బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా తీసుకున్న నిర్ణయంపై ఇండియన్ మిలిటరీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ, అమెరికా బలగాలు వైదొలగితే... ఆటంకవాదులు మళ్లీ ఆఫ్ఘాన్ లో అడుగుపెట్టే ప్రమాదం ఉందని అన్నారు. అయితే ఆటంకవాదులు ఏ దేశాలనే పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు.
ఆఫ్ఘనిస్థాన్ లో సుదీర్థ యుద్ధానికి ముగింపు పలుకుతున్నామని... మే 1వ తేదీ నుంచి భద్రతాబలగాలను వెనక్కి రప్పిస్తున్నామని బైడెన్ చెప్పారు. దాదాపు 2 దశాబ్దాలుగా ఆఫ్థనిస్థాన్ లో నాటో బలగాలు మోహరించి ఉన్నాయి. అమెరికా నేతృత్వంలో నాటో దళాలు తాలిబాన్లపై ఉక్కుపాదం మోపాయి. ఇదే సమయంలో దాదాపు 2,400 మంది అమెరికా సైనికులు ఆఫ్ఘనిస్థాన్ లో ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ఆఫ్ఘన్ సైనికులు మృతి చెందారు.