Manickam Tagore: తెలంగాణలో అభివృద్ధి అంటే కేటీఆర్ బ్యాంకు బ్యాలెన్స్, కవిత నగల పెరుగుదల కాదు: మాణికం ఠాగూర్

Manickam Tagore comments on Nagarjuna Sagar By Polls
  • సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో మాణికం ఠాగూర్ వ్యాఖ్యలు
  • జానారెడ్డి విజయం ఖాయమైందని వెల్లడి
  • జానా వంటి సీనియర్ అసెంబ్లీకి వెళ్లాలన్న ఠాగూర్
  • టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపణ
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్ మీడియాతో మాట్లాడారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల కారణంగా తాను నాగార్జునసాగర్ లో అధిక సమయం కేటాయించలేకపోయానని వెల్లడించారు. అయితే, సాగర్ లో కాంగ్రెస్ పార్టీ ఎంతో బలంగా ఉందని తెలిపారు. సాగర్ ఉప ఎన్నికలో జానారెడ్డి విజయం ఎప్పుడో ఖాయమైందని అన్నారు. ప్రజల గొంతుక వినిపించేందుకు జానారెడ్డి వంటి సీనియర్ నేతలు అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో అభివృద్ధి అంటే కేటీఆర్ బ్యాంకు బ్యాలెన్స్, కవిత నగల పెరుగుదల కాదని వ్యంగ్యం ప్రదర్శించారు. సాగర్ లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. మద్యం, ధనం, పోలీస్ పవర్ ఉపయోగిస్తున్నారని, పోలీసులు సీఎం ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇక, సాగర్ ఉప ఎన్నిక ముగిసిన తర్వాతే టీపీసీసీ కొత్త చీఫ్ నియామకం ఉంటుందని మాణికం ఠాగూర్ స్పష్టం చేశారు.

అటు, హైదరాబాదు పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలంటూ దీక్ష చేస్తున్న సీనియర్ నేత వీహెచ్ కు మాణికం ఠాగూర్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. కరోనా సమయంలో దీక్ష చేయడం సరికాదని, అందుకే వీహెచ్ తో వీక్ష విరమింప చేశామని వెల్లడించారు.
Manickam Tagore
Nagarjuna Sagar Bypolls
Jana Reddy
Congress
TRS
KCR
KTR
K Kavitha
Telangana

More Telugu News