Delhi Capitals: కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన రాజస్థాన్... ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైన ఢిల్లీ క్యాపిటల్స్
- వాంఖెడే స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్
- మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
- 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 రన్స్
- పంత్ 51 పరుగులు
- ఉనద్కట్ కు మూడు వికెట్లు
ఐపీఎల్ లో నేడు ఢిల్లీ, రాజస్థాన్ జట్ల మధ్య ముంబయి వాంఖెడే స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ ప్రదర్శన కనబర్చారు. దాంతో భారీ హిట్టర్లతో కూడిన ఢిల్లీ ఓ మోస్తరు స్కోరుతో సరిపెట్టుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. కెప్టెన్ రిషబ్ పంత్ చేసిన 51 పరుగులే అత్యధికం. తొలి మ్యాచ్ ఆడుతున్న లలిత్ యాదవ్ 20, టామ్ కరన్ 21 పరుగులు చేశారు.
అంతకుముందు, ఓపెనర్లు పృథ్వీ షా (2), శిఖర్ ధావన్ (9), వన్ డౌన్ ఆటగాడు రహానే (8) విఫలమయ్యారు. ఈ మూడు వికెట్లు లెఫ్టార్మ్ సీమర్ జయదేవ్ ఉనద్కట్ ఖాతాలోకి వెళ్లాయి. ఆదుకుంటాడనుకున్న ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ (0) డకౌట్ అయ్యాడు. రాజస్థాన్ బౌలర్లలో ఉనద్కట్ 3, ముస్తాఫిజూర్ రెహ్మాన్ 2, క్రిస్ మోరిస్ ఓ వికెట్ తీశారు.