Justice Nariman: ఇండియాకు త్వరలోనే తొలి మహిళా చీఫ్ జస్టిస్: జస్టిస్ నారిమన్

Will See Lady CJ in India in Future Says Justice Nariman

  • మహిళకు ఇంతవరకూ రాని అవకాశం
  • ఎన్వీ రమణ తరువాత జస్టిస్ నాగరత్నకు చాన్స్
  • అభిప్రాయపడిన జస్టిస్ నారిమన్

స్వతంత్ర భారతావనిలో ఇంతవరకూ సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ గా ఒక్క మహిళకు కూడా అవకాశం దక్కలేదు. అయితే, ఓ మహిళకు ఈ బాధ్యతలు లభించడానికి మరెంతో కాలం పట్టబోదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ వ్యాఖ్యానించారు. జస్టిస్ సునందా భండారా ఫౌండేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, సమీప భవిష్యత్తులోనే భారతావని తొలి మహిళా చీఫ్ జస్టిస్ ను చూడబోతోందని అన్నారు.

కాగా, రెండు రోజుల క్రితం చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, వివిధ హైకోర్టులకు అడ్ హాక్ జడ్జీలను నియమిస్తూ, మనకు మంచి అభ్యర్థులు వచ్చినప్పుడే టాప్ పోస్టుకు ఓ మహిళ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించగా, ఆపై గంటల వ్యవధిలోనే నారిమన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇప్పటివరకూ సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా ఎనిమిది మంది మహిళలు సేవలందించారు. 2014 తరువాత కేవలం ముగ్గురికే ఈ అవకాశం లభించింది.

వచ్చే వారంలో చీఫ్ జస్టిస్ బోబ్డే పదవీ విరమణ చేయనుండగా, ఆపై ఎన్వీ రమణ సీజేగా ప్రమాణం చేయనున్న సంగతి తెలిసిందే. వచ్చే శనివారం నుంచి 2022 ఆగస్టు 26 వరకూ ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆ తరువాత మాత్రం ఓ మహిళకు సీజేగా బాధ్యతలు అందే అవకాశాలు ఉన్నాయని నారిమన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కర్ణాటక హైకోర్టులో పనిచేస్తున్న జస్టిస్ బీవీ నాగరత్నకు ఈ అవకాశం లభిస్తుందని, గత వారంలో జరిగిన సుప్రీంకోర్టు కొలీజియం సైతం ఆమెను ప్రమోట్ చేయాలని నిర్ణయించిందని అన్నారు.

  • Loading...

More Telugu News