Peddireddi Ramachandra Reddy: తిరుపతిలో దొంగ ఓట్ల ఆరోపణల కలకలంపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం
- ప్రతిపక్ష పార్టీలకు మద్దతు లేదు
- అందుకే దొంగ ఓట్లు అంటూ ఆరోపణలు
- ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం
- ప్రణాళికబద్ధంగానే దొంగ ఓట్ల డ్రామా
తిరుపతిలో దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ వస్తోన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రతిపక్ష పార్టీలకు మద్దతు లేకపోవడంతోనే దొంగ ఓట్లు అంటూ తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము కూడా ఆయా పార్టీల నేతల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
ప్రణాళికబద్ధంగానే దొంగ ఓట్ల ఆరోపణల డ్రామాను ప్రతిపక్ష పార్టీలు ఆడుతున్నాయని ఆయన ఆరోపించారు. తిరుపతికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని పట్టుకుని దొంగ ఓట్లు వేయడానికి వచ్చారా? అంటూ ప్రశ్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తిరుపతి యాత్రా స్థలం కావడంతోనే ఆ ప్రాంతానికి ప్రైవేటు బస్సులు వస్తాయని, ఆ బస్సులను వైసీపీవిగా చిత్రీకరించడం కుట్రపూరితమేనని చెప్పారు.
తనపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే ఊరుకోనని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే తమపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఓటమి భయంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తనపై నారా లోకేశ్ చేస్తోన్న ఆరోపణలు సరికాదని చెప్పారు.