Mohammed jani: మాజీ మంత్రి, వైసీపీ నేత మహ్మద్ జానీ కన్నుమూత
- గుండెపోటుతో మరణించిన జానీ
- 1989 నుంచి 93 వరకు మంత్రిగా సేవలు
- వైఎస్సార్, రోశయ్య హయాంలో శాసనమండలికి
మాజీ మంత్రి, వైసీపీ నేత మహ్మద్ జానీ నిన్న మధ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. 1985, 1989లలో గుంటూరు-1 నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన జానీ కాంగ్రెస్లో పాతతరం నేతగా గుర్తింపు పొందారు. 1989 నుంచి 1993 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యువజన సర్వీసులు, చిన్న పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. 2006లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. నాలుగేళ్లపాటు శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా సేవలు అందించారు.
ఆ తర్వాత 2010లో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య హయాంలో శానసమండలికి మరోమారు ఎన్నికై 2016 వరకు కొనసాగారు. ఆ తర్వాత 2017లో తెలుగుదేశం పార్టీలో చేరి రెండేళ్లపాటు కొనసాగారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. కాగా, ఏడాది క్రితం జానీ భార్య మృతి చెందారు.
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, ఎమ్మెల్యే ముస్తాఫా తదితరులు జానీ మృతికి సంతాపం ప్రకటించారు.