Tirumala: తిరుమలలో తగ్గిన భక్తులు, హుండీ ఆదాయం!
- నిన్న 30 వేల మందికి దర్శనం
- హుండీ ద్వారా రూ. 1.60 కోట్ల ఆదాయం
- ఆలయంలో నవమి వేడుకలకు ఏర్పాట్లు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కరోనా కారణంగా ముందుగా దర్శనం టికెట్లను ఆన్ లైన్ మాధ్యమంగా బుక్ చేసుకున్న భక్తులు సైతం రావడం లేదు. ఇదే సమయంలో సర్వదర్శనం టోకెన్లను టీటీడీ నిలిపివేయడంతో భక్తుల రద్దీ మరింతగా మందగించింది. శనివారం నాడు స్వామిని 30,537 మంది భక్తులు దర్శించుకోగా, 13,376 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 1.60 కోట్ల ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
ఈ బుధవారం జరిగే శ్రీరామనవమి వేడుకలను ఆలయంలో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, భక్తులు కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. క్యూలైన్లను ఎప్పటిప్పుడు శానిటైజ్ చేస్తున్నామని, భౌతికదూరం పాటిస్తూ, స్వామిని దర్శించుకునే ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. కేసుల తీవ్రతను పరిశీలించిన తరువాత మరోమారు టీటీడీ బోర్డు సమావేశమై, తదుపరి నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు.