Eatala Rajender: అవసరం లేకపోయినా ఆక్సిజన్ కోసం వైద్యులపై ఒత్తిడి చేయడం సరికాదు: ఈటల
- కరోనా ఉద్ధృతిపై ఈటల సమీక్ష
- రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని వెల్లడి
- రోగుల ఆందోళనను బట్టి వైద్యం చేయొద్దని డాక్టర్లకు సూచన
- రోజుకు 260 టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతోందని వివరణ
తెలంగాణలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి తెలంగాణలో ఆక్సిజన్ కొరత లేదని వెల్లడించారు. అయితే, కొందరు రోగులు అవసరం లేకపోయినా ఆక్సిజన్ కోసం వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారని, ఇది సరైన ధోరణి కాదని స్పష్టం చేశారు. రోగి ఆందోళనను బట్టి చికిత్స చేయవద్దని, రోగికి ఏది అవసరమో గుర్తించి దాని ప్రకారమే చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.
ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా వైద్యశాఖ అధికారులు ప్రతి రోజు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని ఈటల వివరించారు. రోజుకు 260 టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతోందని, రోగుల సంఖ్య పెరిగితే 350 టన్నుల వరకు ప్రాణవాయువు అవసరం అని తెలిపారు. ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్ర ప్రభుత్వానికి చెందిన విషయం అని, రాష్ట్రాలు ఇప్పటికిప్పుడు ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకోలేవని పేర్కొన్నారు.