TS High Court: నైట్ కర్ఫ్యూ, వారాంతపు లాక్ డౌన్ పై 48 గంటల్లో నిర్ణయం తీసుకోవాలి: తెలంగాణ సర్కారుకు హైకోర్టు ఆదేశం
- తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ
- సర్కారు నిర్ణయం తీసుకోకుంటే ఆదేశాలు ఇస్తామన్న హైకోర్టు
- అన్ని అంశాలు ప్రజలకు తెలిశాయన్న ధర్మాసనం
- ప్రభుత్వానికే తెలియాల్సి ఉందని వ్యాఖ్యలు
- తదుపరి విచారణ ఈ నెల 23కి వాయిదా
తెలంగాణలో కరోనా పరిస్థితులపై విచారణ సందర్భంగా రాత్రి వేళ కర్ఫ్యూ, లాక్ డౌన్ అంశంలో హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాత్రి కర్ఫ్యూ, వారాంతపు లాక్ డౌన్ పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. సర్కారు 48 గంటల్లోపు నిర్ణయం తీసుకోకపోతే, తామే ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం కరోనా తీరుతెన్నులకు సంబంధించిన అన్ని అంశాలు ప్రజలకు తెలిశాయని, ప్రభుత్వానికే తెలియాల్సి ఉందని ధర్మాసనం మొట్టికాయలు వేసింది.
బహిరంగ ప్రదేశాల్లో రద్దీ నియంత్రణ, ఎన్నికల సభలు, వివాహాలు, అంత్యక్రియలు వంటి కార్యక్రమాలపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించింది. ఓ కుటుంబం అంతా కరోనా బారినపడితే ఏవిధంగా సాయం చేస్తున్నారని అడిగింది. కరోనా బాధితులకు సత్వర చికిత్స అందేలా ఆర్టీపీసీఆర్ ఫలితం 24 గంటల్లోపే వచ్చేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు తెలంగాణ సర్కారుకు స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.