Corona Virus: 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా: కేంద్రం తాజా నిర్ణయం
- దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ
- కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం
- మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా
- పరిస్థితి తీవ్రత నేపథ్యంలో అంగీకరించిన కేంద్రం
దేశవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా అందించాలని నిర్ణయించింది. మే 1 నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. నేడు వివిధ వర్గాలతో ప్రధాని మోదీ విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ఆ సమావేశాలు ముగిసిన అనంతరం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం గమనార్హం.
దేశవ్యాప్తంగా కరోనా ప్రమాదకర స్థాయిలో వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, దీన్ని అడ్డుకోవడానికి వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడం ఒక్కటే మార్గమని నిపుణులు సూచించారు. ఈ క్రమంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా అందించేందుకు కేంద్రం ఆమోదం తెలపాలన్న డిమాండ్ వినిపించింది. ముఖ్యంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రులు ఈ దిశగా కేంద్రానికి పలుసార్లు విజ్ఞప్తులు చేశారు. పరిస్థితి తీవ్రతను బట్టి కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది.
అయితే, అందరికీ అందించేందుకు సరిపడా టీకాలు ప్రస్తుతం ఉన్నాయా? అన్నది అందరి మెదళ్లలో మెదులుతున్న ప్రశ్న. ఇప్పటికే అనేక రాష్ట్రాలు టీకాలు లేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివేశాయి. మరికొన్ని రాష్ట్రాలు పరిమిత సంఖ్య టీకాలతో నెట్టుకొస్తున్నాయి.