ICMR: కరోనా 2.0లో వెంటిలేటర్ల వినియోగం తగ్గింది... ఆక్సిజన్ వాడకం పెరిగింది: ఐసీఎంఆర్
- భారత్ లో కరోనా సెకండ్ వేవ్
- సునామీలో కొత్త కేసులు
- 70 శాతం 40 ఏళ్లకు పైబడినవారేనంటున్న ఐసీఎంఆర్
- గతేడాదికి, ఇప్పటికి వయసుల్లో వ్యత్యాసం లేదన్న చైర్మన్
భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కరోనా సెకండ్ వేవ్ పై ఆసక్తికర అంశాలు వెల్లడించింది. కొత్తగా వెల్లడవుతున్న కేసుల్లో 70 శాతం 40 ఏళ్లకు పైబడినవారే ఉంటున్నారని తెలిపింది. గతేడాదితో పోల్చితే అత్యధికంగా కరోనా బారినపడుతున్న వారి వయసుల్లో పెద్దగా వ్యత్యాసం లేదని ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరామ్ భార్గవ అన్నారు. అయితే కరోనా 2.0లో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ వినియోగం బాగా పెరిగిందని తెలిపారు.
అదే సమయంలో, మొదటి విడతతో పోల్చితే ఈ దఫా వెంటిలేటర్ల వాడకం తగ్గిందని వివరించారు. కరోనా మొదటి తాకిడి సందర్భంగా 41.5 శాతం మందికి ఆక్సిజన్ అవసరం కాగా, రెండో తాకిడిలో 54.5 శాతం ఆక్సిజన్ అవసరం ఏర్పడుతోందని పేర్కొన్నారు. గతంలో లక్షణాలు లేని రోగుల సంఖ్య తక్కువగా ఉంటే, ఇప్పుడు అలాంటి వారి సంఖ్య ఎక్కువగా ఉందని అన్నారు.