Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధింపు
- కరోనా ఉగ్రరూపం దాల్చుతోన్న నేపథ్యంలో నిర్ణయం
- కర్ఫ్యూ నేటి నుంచే అమల్లోకి..
- ఈ నెల 30 వరకు ఆంక్షలు
- రాత్రి 8 గంటలకే కార్యాలయాలు, హోటళ్లను మూసి వేయాలి
తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కర్ఫ్యూ నేటి నుంచే అమల్లోకి వస్తుందని ఈ నెల 30 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ కర్ఫ్యూ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటుందని వివరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాత్రి 8 గంటలకే కార్యాలయాలు, దుకాణాలు, హోటళ్లను మూసి వేయాలని పేర్కొంది. కర్ఫ్యూ నుంచి ఆసుపత్రులు, ఫార్మసీలు, ల్యాబ్లు, అత్యవసర సేవలకు మినహాయింపు నిచ్చింది. అలాగే, మీడియా, పెట్రోల్ బంక్, ఐటీ సేవలకు అనుమతి నిచ్చింది. విద్యుత్, కోల్డ్ స్టోరేజ్, వేర్ హౌసింగ్ వంటి సంస్థలు యథాతథంగా కార్యకలాపాలను జరుపుకోవచ్చు. స్థానిక, అంతర్రాష్ట్ర బస్సు సేవలు యథాతథంగా రాత్రిపూట కూడా కొనసాగుతాయి. ఎలాంటి ప్రత్యేకమైన పాసులూ ఇవ్వరు.
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు రాత్రి పూట కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో ఆరు రోజుల పాటు పూర్తి స్థాయి లాక్డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా కర్ఫ్యూ విధించింది.