Devineni Uma: మార్ఫింగ్ వీడియో కేసు.. దేవినేని ఉమ ఇంటికి సీఐడీ అధికారులు!
- టీడీపీ నేతకు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు
- విచారణకు హాజరు కాకపోవడంతో నేరుగా ఇంటికి
- ఇంట్లో లేరని చెప్పిన కుటుంబ సభ్యులు
తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మార్ఫింగ్ వీడియో ప్రదర్శించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై ఇప్పటికే కేసు నమోదైంది.
విచారణకు హాజరు కావాలంటూ సీఐడీ అధికారులు ఉమామహేశ్వరరావుకు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. దీంతో తొలుత పది రోజుల సమయం కావాలని ఉమ కోరారు. ఆ తర్వాత ఈ నెల 19న మరోమారు నోటీసులు పంపగా విచారణకు హాజరు కాలేదు. దీంతో నిన్న అధికారులు నేరుగా ఆయన ఇంటికి వెళ్లారు. అయితే, ఆయన ఇంట్లో లేరని కుటుంబ సభ్యులు చెప్పడంతో అధికారులు వెనుదిరిగారు.