Andhra Pradesh: పది, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయండి: సీఎం జగన్ కు సోము వీర్రాజు విజ్ఞప్తి
- పరీక్షల కోసం విద్యార్థులు ప్రయాణాలు చేయాలి
- దాని వల్ల మహమ్మారి మరింత ప్రబలే ప్రమాదం
- బాధితులను ప్రైవేట్ ఆసుపత్రులు దోచేస్తున్నాయి
- కరోనా చికిత్స ఖర్చులపై విధివిధానాలు రూపొందించాలి
- విజయవాడ, రాయలసీమల్లోనూ ఆక్సిజన్ ఉత్పత్తి చేయాలని డిమాండ్
కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని ఏపీ సీఎం జగన్ ను ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కోరారు. ఇప్పటికే ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వారిని పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్ చేశారని గుర్తు చేసిన ఆయన.. పది, ఇంటర్ విద్యార్థులకు మాత్రం షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామనడం మంచిది కాదన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సల పేరిట దోపిడీ వంటి విషయాలపై నేడు ఆయన సీఎం జగన్ కు లేఖ రాశారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో జూన్ లో పరీక్షలు నిర్వహించడం పెద్ద సమస్యగా మారుతుందన్నారు. పరీక్షల కోసం విద్యార్థులు బస్సులు, ఆటోల్లో పరీక్షా కేంద్రాలకు రావాల్సి ఉంటుందని, దాని ద్వారా కరోనా మహమ్మారి మరింత ప్రబలే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. కాబట్టి విద్యార్థుల భద్రత, రక్షణను దృష్టిలో పెట్టుకుని పరీక్షలను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు ఇస్తున్న చికిత్సా విధానాలు, చార్జీలపైనా ప్రభుత్వం దృష్టి పెట్టాలని సోము కోరారు. రోగులను ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్స పేరిట దోచేస్తున్నాయని ఆరోపించారు. కొందరు లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోందని, దీంతో చాలా మంది అప్పులపాలవుతున్నారని అన్నారు. అంత ఖర్చు చేసినా చాలా మంది ప్రాణాలు నిలబడడం లేదన్నారు. కాబట్టి కరోనా బాధితుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు.
తక్కువ ఖర్చుతో బాధితులకు చికిత్స అందించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. చికిత్స ఖర్చులపై అధికారుల ద్వారా నిత్యం పర్యవేక్షించాలని చెప్పారు. ఖర్చులపై విధివిధానాలను రూపొందించాలని డిమాండ్ చేశారు. కరోనా నియంత్రణకు అవసరమైన మందులు, ఆక్సిజన్ సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. చాలా మంది పేషెంట్లు ఆక్సిజన్ అందక చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మందులు, ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్ కు తరలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విశాఖతో పాటు విజయవాడ, రాయలసీమల్లోనూ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.