COVID19: కొవిషీల్డ్ ధరలను ఖరారు చేసిన సీరమ్
- రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400
- ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600
- మిగతా దేశాలతో పోలిస్తే తక్కువేనన్న సంస్థ
- రెండు నెలల్లో ఉత్పత్తిని పెంచుతామని వెల్లడి
- ఆ తర్వాత 4–5 నెలల్లో మెడికల్ షాపుల్లో అందుబాటులోకి
కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ ధరలను సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ ఆసుపత్రులకు వేర్వేరు ధరలను నిర్ణయించింది. రాబోయే రెండు నెలల్లో వ్యాక్సిన్ కొరతను అధిగమిస్తామని, మరికొన్ని నెలల్లో మెడికల్ షాపుల్లోనూ వాటిని అందుబాటులోకి తెస్తామని పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వ అవసరాల నిమిత్తం ఉత్పత్తి సామర్థ్యాన్ని 50 శాతం పెంచుతామని, మిగతా సగం సామర్థ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రుల సరఫరా కోసం వినియోగించుకుంటామని నేడు విడుదల చేసిన ఓ ప్రకటనలో సంస్థ సీఈవో అదర్ పూనావాలా వెల్లడించారు.
కేంద్రప్రభుత్వ ఆదేశానుసారం వ్యాక్సిన్ ధరలను నిర్ణయించామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600 ధరకు కొవిషీల్డ్ వ్యాక్సిన్లను విక్రయిస్తామని తెలిపారు. ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఉన్న వ్యాక్సిన్ల ధరలతో పోలిస్తే తక్కువ ధరకే వ్యాక్సిన్ ను అందజేస్తున్నామని చెప్పారు.
అమెరికాలో ఒక్కో వ్యాక్సిన్ ధర రూ.1,500 కన్నా ఎక్కువే ఉందని, రష్యా, చైనా టీకాలు రూ.750కిపైనే ఉన్నాయన్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్ల సరఫరాలో ఉన్న సంక్లిష్టతల వల్ల ఒక్కో కార్పొరేట్ సంస్థకు ప్రత్యేకంగా వ్యాక్సిన్లను పంపలేమని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థలు లేదా ప్రైవేట్ వ్యవస్థల నుంచి వ్యాక్సిన్లను తీసుకోవాలని కోరారు. ఆ తర్వాత నాలుగైదు నెలల్లో మెడికల్ షాపుల్లోనూ వ్యాక్సిన్లను అందుబాటులోకి తెస్తామన్నారు.