Prakash Raj: ఎవరో సీఎం అభ్యర్థిగా ప్రకటించడం ఏమిటి? పవన్ కల్యాణే సీఎం అభ్యర్థిగా ఉండాలి: ప్రకాశ్ రాజ్

Pawan Kalyan has to speak about his ideology says Prakash Raj

  • బీజేపీ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ స్పందన
  • పవన్ తన సిద్ధాంతం ఏమిటో చెప్పాలి
  • విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయడం సరికాదు

ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కల్యాణ్ అని రాష్ట్ర బీజేపీ నేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ను ఎవరో సీఎం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకూడదని అన్నారు.

బీజేపీ నేతలు పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం అభిమానులు చెప్పినట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు పని చేయడం లేదని.. ఆ విషయం వారి వ్యాఖ్యలతో అర్థమవుతోందని అన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని... పవన్ ప్రజల ముందుకు వచ్చి తన సిద్ధాంతం ఏమిటో చెప్పాలని సూచించారు.

దేశమంతటా ఒకే ఫార్ములా తీసుకొస్తామని కేంద్రంలోని బీజేపీ చెపుతోందని... అది సాధ్యం కాదని ప్రకాశ్ రాజ్ అన్నారు. దేశంలో భిన్న సంస్కృతులు, భాషలు, అవసరాలు ఉన్నాయని చెప్పారు. అందుకే ఫెడరల్ సిస్టమ్ గురించి కేసీఆర్, మమతా బెనర్జీ మాట్లాడుతున్నారని తెలిపారు.

ఏపీ, తెలంగాణల్లో వ్యవసాయ మంత్రి ఎవరు ఉండాలనే విషయాన్ని ఉత్తర భారతీయుడు నిర్ణయించలేడని అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయాలనే నిర్ణయం సరికాదని చెప్పారు. నష్టాలు వస్తున్నాయంటూ అమ్మేయడం కరెక్ట్ కాదని... ప్రభుత్వాలు వ్యాపారం చేయకూడదని అన్నారు. నష్టాలు వస్తే ప్రభుత్వానికి వచ్చిన నొప్పి ఏమిటని... అది ప్రజల ఆస్తి అని చెప్పారు.

పశ్చిమబెంగాల్ లో బీజేపీ గెలుస్తుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నట్టు వస్తున్న వార్తలపై ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ... ఎక్కడో ప్రైవేట్ గా మాట్లాడిన మాటలను బీజేపీ కట్ చేసి, వారికి అనుకూలంగా ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. ప్రశాంత్ కిశోర్ కేవలం ఎన్నికల వ్యూహకర్త మాత్రమేనని... ఎన్నికల్లో గెలుపు, ఓటములను నిర్ణయించేది ప్రజలేనని చెప్పారు.

  • Loading...

More Telugu News