West Bengal: కొవిడ్ నేపథ్యంలో బెంగాల్లో ప్రచార కార్యక్రమాలపై ఈసీ ఆంక్షలు
- బెంగాల్లో అడ్డూ అదుపు లేని కరోనా
- జోరుగా సాగిన ఎన్నికల ప్రచార కార్యక్రమాలు
- ఇప్పటికే ప్రచారాలను పరిమితం చేసుకున్న పార్టీలు
- హైకోర్టు ఆదేశాల మేరకు చర్యలు ప్రారంభించిన ఈసీ
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బెంగాల్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. పబ్లిక్ ర్యాలీలు, పాదయాత్రలు, రోడ్ షోలపై నిషేధం విధించింది. 500 మంది కంటే తక్కువ హాజరయ్యే సమావేశాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో ఇంకా రెండు విడతల పోలింగ్ మిగిలి ఉన్న తరుణంలో ఈసీ చర్యలు ప్రారంభించింది.
బెంగాల్లో కరోనా పరిస్థితిపై కోల్కతా హైకోర్టు నేడు విచారణ జరిపింది. ఎన్నికల ప్రచార సభలు, ర్యాలీలు కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారే ప్రమాదం ఉందన్న పిటిషనర్ల వాదనతో కోర్టు ఏకీభవించింది. వెంటనే తగు చర్యలు చేపట్టాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీనిపై రేపు జరగబోయే విచారణలో నివేదికను సమర్పించాలని కోరింది. ఈ నేపథ్యంలోనే ఈసీ నేడు చర్యలకు ఉపక్రమించింది. విచారణ సందర్భంగా ఈసీపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. అధికారం ఉన్నప్పటికీ.. కొవిడ్ కట్టడికి ఈసీ తగు చర్యలు తీసుకోలేదని తెలిపింది.