Mukesh Ambani: ముఖేశ్ వ్యాపార సామ్రాజ్యంలోకి 900 ఏళ్ల చారిత్రక ప్రదేశం!
- బ్రిటన్ స్టోక్ పార్క్ ను చేజిక్కించుకున్న భారత కుబేరుడు
- రూ.592 కోట్లకు కొనుగోలు
- నిన్న పొద్దుపోయాక ఎక్స్ చేంజ్ ఫైలింగ్
- 300 ఎకరాల్లో విస్తరించిన స్టోక్ పార్క్
భారత కుబేరుడు ముఖేశ్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యం రిలయన్స్ ఇండస్ట్రీస్ లో మరో బ్రిటన్ సంస్థను కలిపేసుకున్నారు. స్టోక్ పార్క్ అనే చారిత్రక పర్యాటక ప్రాంతాన్ని 7.9 కోట్ల డాలర్లకు (సుమారు రూ.592 కోట్లు) కొనుగోలు చేశారు. బకింగ్ హాంషైర్ లో హోటల్, క్రీడలు, థీమ్ పార్క్ లను స్టోక్ పార్క్ నిర్వహిస్తోంది. జేమ్స్ బాండ్ సినిమాల్లోని రెండు సీక్వెన్స్ లకు సంబంధించిన సన్నివేశాలను స్టోక్ పార్క్ లోనే తీయడం విశేషం. 1964 నాటి 'గోల్డ్ ఫింగర్' సినిమాతో స్టోక్ పార్క్ లోని గోల్ఫ్ కోర్స్ చాలా ప్రసిద్ధి చెందింది.
స్టోక్ పార్క్ కు 900 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది. సంస్థ వెబ్ సైట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం 1908 దాకా దానిని ప్రైవేట్ నివాసంగా వాడేవారట. దీనికి ఎన్నో విశేషాలున్నాయి. దాదాపు 300 ఎకరాల్లో స్టోక్ పార్క్ విస్తరించి ఉంది. మధ్యలో తెల్లటి ఓ పెద్ద సౌధం, 49 విలాసవంతమైన పడక గదులు, 27 స్లాట్స్ ఉన్న గోల్ఫ్ కోర్స్ లు, 13 టెన్నిస్ కోర్టులు, 14 ఎకరాల ప్రైవేట్ గార్డెన్ ల వంటి వాటితో స్టోక్ పార్క్.. పర్యాటకులను ఆకర్షిస్తోంది. ముఖేశ్ అంబానీ దంపతులూ అప్పుడప్పుడు అక్కడకు వెళ్తుంటారు.
ఇదే క్రమంలో ఆయన దాని పట్ల ఆకర్షితులయ్యారని సమాచారం. ఈ క్రమంలో దానిని కొనుగోలు చేసిన రిలయన్స్ అధిపతి.. గురువారం పొద్దుపోయాక కొనుగోలుకు సంబంధించి ఎక్స్ చేంజ్ ఫైలింగ్ దాఖలు చేశారు. ఈ వారసత్వ ప్రదేశంలో క్రీడలు, మనోల్లాస సౌకర్యాలను మెరుగుపరుస్తామని రిలయన్స్ ప్రకటించింది.