Nadeem Sravan: 'సంగీత దర్శకుడు శ్రావణ్ మృతదేహం ఇచ్చేందుకు 10 లక్షల డిమాండ్' అంటూ వార్తలు.. ఖండించిన ఆసుపత్రి!
- కరోనాతో కన్నుమూసిన శ్రావణ్ రాథోడ్
- మృతదేహం ఇచ్చేందుకు రూ. 10 లక్షల డిమాండ్
- అవాస్తవమని ప్రకటించిన ఆసుపత్రి యాజమాన్యం
బాలీవుడ్ లో నదీమ్ - శ్రావణ్ ద్వయంగా ప్రఖ్యాతి వహించిన జంటలో ఒకరైన శ్రావణ్ రాథోడ్ కరోనా కారణంగా న్యూఢిల్లీలోని ఫోర్టిస్ అసోసియేట్స్ ఆధ్వర్యంలోని ఎస్ఎల్ రహేజా ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. 66 ఏళ్ల శ్రావణ్, గత కొన్ని రోజులుగా కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించి మరణించారు. ఆయన మరణం సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
కాగా, శ్రావణ్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించేందుకు ఫోర్టిస్ యాజమాన్యం ఏకంగా రూ. 10 లక్షల బిల్లు వేసిందని, డబ్బు చెల్లించిన మీదటే, మృతదేహాన్ని తీసుకుని వెళ్లాలని డిమాండ్ చేసిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై పలువురు అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మృతదేహాల విషయంలోనూ ఆసుపత్రి వర్గాలు పీడిస్తున్నాయని కామెంట్లు వచ్చాయి. అయితే, ఈ వార్తలన్నీ అవాస్తవమని చెబుతూ, ఫోర్టిస్ అసోసియేట్స్ ఓ ప్రకటన విడుదల చేసింది.
"శ్రావణ్ రాథోడ్ ఇకలేరన్న వార్తను చెప్పేందుకు మేమెంతో చింతించాం. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపాం. ఈ సమయంలో వారు ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ కష్టకాలంలో వారి కుటుంబానికి తోడుగా ఉంటాం. అయితే, సోషల్ మీడియాలో కొన్ని రూమర్లు వస్తున్నాయి. ఏ మాత్రం నిజానిజాలు తెలుసుకోకుండా, మేము చెల్లింపుల కోసం ఒత్తిడి తెస్తున్నామని కొందరు ఆరోపిస్తున్నారు. ఇదంతా అవాస్తవం" అని పేర్కొంది.