Corona Virus: ఎట్టి పరిస్థితుల్లోనూ మహమ్మారి గ్రామాల్లోకి రాకుండా ఆపాలి: ప్రధాని మోదీ పిలుపు
- గత ఏడాది కరోనాను నిలువరించడంలో గ్రామాలు సఫలం
- క్షేత్రస్థాయిలో నాయకులు, అధికారుల కీలక పాత్ర
- ఈసారీ అదే స్ఫూర్తిని కొనసాగించాలి
- ‘దవాయీ భీ.. కడాయీ భీ అన్నదే నినాదం కావాలి
- గ్రామాలకు ప్రధాని మోదీ పిలుపు
గత ఏడాదితో పోలిస్తే తాజాగా కరోనా విసురుతున్న సవాల్ చాలా పెద్దదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మహమ్మారి గ్రామాల్లోకి రాకుండా గ్రామస్థులే అన్ని రకాల చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జరిగిన వర్చువల్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కరోనాను ఎదుర్కోవడంలో ‘దవాయి భీ.. కడాయీ భీ (ఔషధాలు కూడా.. అప్రమత్తత కూడా)’ అన్నదే గ్రామాల నినాదం కావాలని పిలుపునిచ్చారు. ఏడాదిగా కరోనాను సమర్థంగా ఎదుర్కొంటున్న అనుభవంతో మహమ్మారి తమ గ్రామంలోకి రాకుండా ప్రజలు మరోసారి సమర్థంగా పనిచేయగలరని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పంచాయతీ ప్రతినిధులు కరోనాను నిలువరించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ప్రజల్ని చైతన్యం చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించారన్నారు. అదే స్ఫూర్తి, అనుభవంతో ఈసారి కూడా మహమ్మారిని నిలువరించడంలో విజయవంతం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతకుముందు స్వమిత్వ పథకంలో భాగంగా ఎలక్ట్రానిక్ ఆస్తి కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. ఉత్తమ జిల్లాలు, పంచాయతీలకు పురస్కారాలు అందజేశారు. వర్చువల్గా జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సహా 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పంచాయతీ ప్రతినిధులు పాల్గొన్నారు.