Bharat Biotech: ప్రైవేటు హాస్పిటల్స్ కు రూ. 1,200, రాష్ట్రాలకు రూ. 600... కొవాగ్జిన్ ధర ఖరారు!
- వ్యాక్సిన్ ఉత్పత్తి వ్యయం పెరిగిపోయింది
- పెరుగుతున్న ఖర్చును తిరిగి రికవరీ చేసుకోవాలి
- ముక్కు ద్వారా టీకాకు నిధులు కావాలి
- ఓ ప్రకటనలో కృష్ణా ఎల్లా
హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న కొవాగ్జిన్ ధరను సదరు సంస్థ ఖరారు చేసింది. ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 1,200, రాష్ట్రాల ప్రభుత్వాలకు రూ. 600 చొప్పున ఒక్కో టీకాను అందిస్తామని సంస్థ పేర్కొంది. ఈ వ్యాక్సిన్ ధర సుమారు 15 నుంచి 20 డాలర్ల మధ్య ఉండవచ్చని వ్యాక్సిన్ నిపుణులు ఆది నుంచి చెబుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇండియాలో అందుబాటులో ఉన్న రెండో వ్యాక్సిన్ కొవిషీల్డ్ ను తయారు చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్, ఒక్కో టీకా ధరను రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 400కు ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 600కు విక్రయిస్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
"పెడుతున్న ఖర్చును తిరిగి రికవరీ చేసుకోవడం మా ప్రయాణంలో తప్పనిసరి. ముక్కు ద్వారా ఇచ్చే టీకాను అభివృద్ధి చేయాలంటే ఎన్నో నిధులు కావాలి. కరోనాపై మా మిషన్ 25 సంవత్సరాలు కొనసాగుతుంది. ప్రపంచానికి నాణ్యమైన ఆరోగ్య సేవలను చౌక ధరల్లో అందించడమే మా లక్ష్యం" అని ఈ సందర్భంగా భారత్ బయోటెక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా ఎల్లా ఓ ప్రకటనలో తెలిపారు.
తామందిస్తున్న కొవాగ్జిన్ అత్యంత నాణ్యతా ప్రమాణాలతో ప్యూరిఫై చేయబడిన వ్యాక్సిన్ అని, దీని కారణంగా ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగిందని, టీకా తయారీ, క్లినికల్ ట్రయల్స్ వంటివి తమ సొంత నిధులతోనే నిర్వహించామని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
కాగా, ఇండియాలో వ్యాక్సినేషన్ తదుపరి దశ మే 1 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. వచ్చే వారం నుంచి దేశంలోని 18 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఈనేపథ్యంలో టీకా కోసం డిమాండ్ ను అధిగమించేందుకు మరిన్ని ప్రైవేటు వ్యాక్సినేషన్ సెంటర్లను రిజిస్టర్ చేయాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలను కోరింది.